ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరోవైపు తెరపైకి “ముందస్తు” మాటలు వస్తున్నవేళ రాజకీయ పార్టీలు దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రతీరోజూ పొత్తుల వ్యవహారం రాజకీయాల్లో తెగ వైరల్ అవుతుంటుంది. ఈ పొత్తులపై ఇప్పటివరకూ టీడీపీ తప్ప అన్ని పార్టీలు తమ వైఖరిని బహిరంగంగా ప్రకటించాయి. ఈ సమయంలో ఈ నెల 8న పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రం నుంచి రావాల్సిన బాకీలు రాబట్టుకుంటూ… సెంట్రల్ విషయంలో తన లెవెల్ చాలా వెడల్పు అని చూపించుకుంటూ… ఏపీలో గ్యాప్ ఇవ్వకుండా జిల్లా పర్యటనలు చేపడుతున్నారు సీఎం జగన్. ఇక, ఇప్పటికే తొలివిడత మేనిఫెస్టోను ప్రకటించి దూకుడు పెంచారు చంద్రబాబు. ఇదే క్రమంలో మరో పదిరోజుల్లో వారాహీ యాత్రకు సిద్ధమవుతోన్నారు జనసేన అధినేత పవన్. ఇలా మూడు పార్టీలు జోరు పెంచాయి.
సరిగ్గా ఈ సమయంలో ఏపీకి రాబోతున్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా. అవును… ఈ నెల 8వ తేదీన అమిత్ షా విశాఖపట్నం రాబోతున్నారు. అక్కడ బీజేపీ ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీంతో… ఆ సభావేదికపై అమిత్ షా చెప్పే మాటలతోనే ఏపీలో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చేయబోతోందని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే జనసేనతో పొత్తు ఉందని బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో… అమిత్ షా సభా వేదికపై జనసేనాని ఉండటం – ఉండకపోవడంతో కూడా జనసేన వైఖరిపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అమిత్ షా నోటివెంట చంద్రబాబు ప్రస్థావన వస్తుందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇద్దరూ ఏపీ పర్యటనకు రాబోతున్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 10వ తేదీన తిరుపతికి వస్తారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా… విశాఖపట్నం, తిరుపతిలో రెండు చోట్ల భారీ బహిరంగ సభల నిర్వహణకు బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.