ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. రాష్ట్రంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్‌తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. తాము విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి ఇచ్చాయని ఈ సందర్భంగా జోయల్ రీఫ్‌మెన్ సీఎం వై ఎస్ జగన్ కు తెలిపారు.
ఈ నేపథ్యంలో విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రమే అలాంటి హబ్ ఉందని చెప్పారు. ఢిల్లీలో ఉన్నట్లుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్ జనరల్ సానుకూలంగా స్పందించారు.
విశాఖలో హబ్ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారు. స్మార్ట్ సిటీగా విశాఖ ఎదగడంలో అమెరికా సహకరించాలని కోరారు. అమెరికా – ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని, ఆ దిశలో తాము కూడా కలిసి నడుస్తామని సీఎం జగన్ జగన్ పేర్కొన్నారు. ఇంగ్లీష్ ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.