జనసేన వైపుగా అడుగులేస్తున్న అంబటి రాయుడు.!

ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి మళ్ళీ వస్తున్నట్లు ఎలాంటి ప్రకటనా చేయలేదుగానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయి వార్తల్లో వ్యక్తిగా మారాడు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.

కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు, పది రోజులు కూడా ఆ పార్టీలో వుండలేకపోయారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాదు, రాజకీయాల నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకుంటున్నట్లూ వెల్లడించాడు.. అదీ ట్విట్టర్ వేదికగా.

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన అంబటి రాయుడు, పవన్ కళ్యాణ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపాడు. పవన్ కళ్యాణ్‌కి ప్రజల పట్ల వున్న అవగాహన, ప్రజా సమస్యల పట్ల వున్న అవగాహన తనను ఆకట్టుకుందని చెప్పాడు అంబటి రాయుడు.

వైసీపీకి రాజీనామా చేశాక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలవాలని సన్నిహితులు, కుటుంబ సభ్యులు సూచించడంతో, ఆయన్ని కలిసి అన్ని విషయాలూ మాట్లాడినట్లు అంబటి రాయుడు పేర్కొన్నాడు.

రాజకీయాల్లోకి వచ్చేముందు ప్రజలతో మమేకమయ్యాననీ, వారి సమస్యల గురించి తెలుసుకున్నాననీ, రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యల్ని పరిష్కరించగలనని అనుకున్నాను తప్ప, ఫలానా చోట నుంచి పోటీ చేయాలని ఏనాడూ అనుకోలేదని అంబటి రాయుడు వివరించాడు.

క్రికెట్ నిమిత్తం అంబటి రాయుడు దుబాయ్ వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరే విషయమై ఒకింత తటపటాయిస్తున్నాడు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం వుంది. ఏమో, అంబటి రాయుడు నిలకడలేని వ్యక్తి. ఈసారి టీడీపీతోనో, బీజేపీతోనో మంతనాలు జరిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.