ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి… ఈ రియాక్షన్ పీక్స్!

చాలా రోజుల నుంచి మీడియాలో నానుతున్న విషయం.. జనాల్లో అనఫిషియల్ గా కన్ ఫాం లో ఉన్న విషయం.. ఈ రోజు పవన్ నోట అఫీషియల్ గా వెలువడింది. దీనిపై ఇక అప్పీల్ లేదన్నట్లుగా పవన్ కల్యాణ్ కన్ ఫాం చేసేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని కుండబద్దలు కొట్టారు. దీంతో వైసీపీ నేతలు పవన్ ని వాయించి వదులుతున్నారు.

గతంలో ఎప్పుడూ టీడీపీతో కలిసి పోటీచేయాలి అని అనుకోలేదు.. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిస్థితులు మరీ దారుణంగా మారిపోతున్నాయని.. ఇవాళే నిర్ణయం తీసుకున్నాను అని పవన్ వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు వైసీపీ నేతలు. మరి ఇంతకాలం డేటింగ్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఎప్పటినుంచో స్టేట్ మెంట్స్ ఇస్తూ… ఇప్పుడు కొత్తగా ఈ ఫెర్ఫార్మెన్స్ ఏమిటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో పవన్ ని విపరీతంగా వెంటాడే వైసీపీ నేతల్లో ఒకరైన అంబటి రాంబాబు పవన్ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు.

ఇందులో భాగంగా… ఊళ్లోపెళ్లికి కుక్కల హడావుడిలా పవన్ తీరు ఉందని ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు… “ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు” అని అన్నారు. ఇదే సమయంలో ములాకత్ కి వెళ్తున్నట్లు వార్తలు వచ్చిన సమయమంలో… “ఎప్పుడో అయ్యాడు ఇప్పుడేముంది కొత్తగా ములాఖత్” అని అన్నారు. అనంతరం… “జనసైనికులు ఆలోచించండి.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా లేదూ?” అంటూ అంబటి రాంబాబు కాస్త ఘాటుగానే విమర్శించారు.

ఇదే సమయంలో వైసీపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విషయంపై స్పందించింది. ఇందులో భాగంగా… “ప్యాకేజీ బంధం బయటపడింది. నువ్వు రాజమండ్రి జైలుకు వెళ్లింది పొత్తును ఖాయం చేసుకునేందుకేనని ప్రజలకు పూర్తిగా అర్థమైంది పవన్. ఇన్నాళ్లూ నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్లకూ ఈ రోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ఠ్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధం” అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.