జనసైనికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా మొదలైంది. అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం వాహనం దూసుకుపోతుంది! ఈ సమయంలో ముందుగా ఊహించినట్లుగానే పవన్ ప్రసంగాలు ప్రారంభం కాకముందే వైసీపీ నేతలు మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ వేదికగా స్పందించారు.
పవన్ కల్యాణ్ పై వేటకారం ఆడటం లోనూ, సీరియస్ వ్యాఖ్యలు చేయడంలోనూ అత్యుత్సాహం చూపించే మంత్రి అంబటి రాంబాబు (పవన్ ని ఉద్దేశిస్తూ) ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. “విప్లవ యోధుడు చే గువేరా పుట్టినరోజు సందర్భగా.. ఓ ప్రశ్న” అంటూ పవన్ ను ఉద్దేశించే పరోక్షంగా ట్వీట్ చేశారు అంబటి.
చేగువేరా జన్మదిన సందర్భంగా ఒక ప్రశ్న:
“టీ షర్ట్ మీద చేగువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను.?” అని అంబటి ట్వీట్ చేశారు.
ఇదే క్రమంలో పరోపక్క సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వారాహి యాత్రపై సెటైర్లు విసిరారు. ముందుగా… “అసలు వారాహి యాత్ర అంటే ఏంటి”? అని ప్రశ్నించిన ఆయన… అదేందో తనకు తెలియదని అన్నారు. అనంతరం, కాశీయాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏమర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అభిప్రాయపడ్డారు.
అయితే ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పవన్ కు ఒక సవాల్ విసిరారు బొత్స. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పవన్ అనడాన్ని ప్రస్తావించిన మంత్రి… టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా… ఈ మధ్యే పవన్ కల్యాణ్ పార్టనర్.. తాము అమలు చేస్తున్న పథకాలను పెంచి ఇస్తానని చెప్పాడని చంద్రబాబుకు చురకలు అంటించారు. అనంతరం… 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… తాను తీసుకొచ్చిన ఒక్క పథకం గురించి అయినా చెప్పగలడా అని నిలదీశారు.