పవన్ ని దగ్గరగా చూస్తే కష్టమే… అంబటి వెటకారం పీక్స్!

పవన్ పై విపరీతమైన వెటకారం ఆడటంలో పోటీపడే వైసీపీ నేతల్లో అంబటి రాంబాబు ఒకరని అంటుంటారు. ఈ పేరుకు ఏమాత్రం తగ్గకుండా అంబటి రాంబాబు తన ఫెర్మార్మెన్స్ చూపిస్తుంటారు. ఈ సమయంలో మరోసారి పవన్ పై అంబటి తనదైన వెటకారం ప్రదర్శించారు.

అవును… తాజాగా తాడేపల్లి గూడెంలోని పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా… పవన్ కల్యాణ్ కి మల్టిపుల్ పర్సనాల్టీ డిజార్టర్ ఉందని.. రాజకీయాల్లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఆయనతో ఎవరూ ఎక్కువ రోజులు కలసి ఉండలేరని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా కనీసం తన పార్టీనుంచి గెలిచిన ఒకేఒక్క ఎమ్మెల్యేని కూడా తనతోపాటు ఉంచుకోలేకపోయారని ఎద్దేవా సిన అంబటి… జనసేనలో చేరి బయటకు వచ్చేసిన నాయకుల లిస్ట్ చదివి వినిపించారు. ఈ సమయంలో పవన్ ని దగ్గరగా చూస్తే ఎవరైనా ఆయనతో ఉండలేరని చెప్పిన అంబటి… దూరంగా చూస్తుంటేనే మా నాయకుడు అది, మా నాయకుడు ఇది అని చెప్పుకోవాల్సిందేనని అన్నారు.

ఇదే క్రమంలో… రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని, కానీ నిలబడగలిగినవారే మొనగాడని చెప్పిన అంబటి… జగన్ జీవిత చరిత్ర ఓసారి తెలుసుకోవాలని పవన్ కి సూచించారు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎత్తుకెళ్తే, వెంట్రుకతో సమానంగా జగన్ భావించారని.. ఆయన పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని అంబటి పవన్ కు సూటిగా సూచించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కు శాపనార్థాలు పెట్టిన అంబటి… పవన్ తన జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేరని అన్నారు. ఇక తనను తాను విప్లవ నాయకుడిని అని చెప్పుకునే పవన్.. ఎక్కడ పోరాటం చేశారో, ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని, కొన్నిరోజులు పోతే సినిమాలకి కూడా పనికిరాడని ఈ సందర్భంగా అంబటి ఎద్దేవా చేశారు.