లంచాల మేత – కంచాల మోత… గట్టిగా తగులుకున్న అంబటి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. సరైన వ్యూహాలు చేసేవారు, ఎత్తులు వేసేవారూ కనుమరుగైపోయారని చెబుతున్నారు. జైల్లో తీవ్ర ఒత్తిడిలో ఉండే చంద్రబాబు వారానికి రెండు రోజులు కలిసే ములాకత్ లో ఎన్నైనా చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో సరిసమానంగా అనుభవం ఉన్న నేతలు ఉన్న పార్టీలో ఇప్పుడు వ్యూహాలు కనుమరుగైపోవడం దారుణం అని అంటున్నారు.

దీనికి కారణం… బాబు అరెస్టైనప్పటినుంచీ టీడీపీ ఒక్కటంటే ఒక్క ఎత్తు పక్కా వేయలేకపోయింది అనేది విమర్శకుల అభిప్రాయంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక వినూత్న కార్యక్రమం అని చెప్పి గతంలో మోడీ చేసిన పనిలాంటి పని చేద్దామని చెప్పుకొస్తున్నారు నారా వారి ఫ్యామిలీ మెంబర్స్. ఇందులో భాగంగా… చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్‌ కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయినా సిగ్గులేకుండా కంచాలు మోగిస్తామంటున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో… సిగ్గుపడాల్సిన పనులు చేసి.. ప్రజల ముందు తలదించుకోవాల్సిన చోట కూడా తల ఎగరేస్తున్న టీడీపీ నేతల అహంకారాన్ని ప్రజలు మరింత అణచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే చంద్రబాబుకు ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపిన అంబటి… ఐదేళ్లు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలిసి ఇప్పుడు కంచాలు ఎవరి మీద మోగిస్తున్నారు? విజిళ్లు ఎవరి మీద ఊదుతారు? హారన్లు ఎవరిని ఉద్దేశించి కొడతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తినేది లంచాలు.. మోగించేది కంచాలా? అంటూ ఆయన ప్రశ్నించిన ఆయన.. మరికొన్ని అంశాలను వదిలారు!

సీఎం జగన్‌ తన నాలుగేళ్ల పాలనలో పేదలకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా రూ.2.35 లక్షల కోట్లు బదిలీ చేస్తే.. అదే స్థాయిలో బడ్జెట్ ఉన్నా కూడా గతంలో ఆ సొమ్మంతా టీడీపీ హయాంలో ఉఫ్‌ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వారంతా విజిళ్లు ఊదుతారా?

అవినీతి చేసి హైదరాబాద్‌ నుంచి అర్ధపారిపోయి వచ్చి, బస్సులో పడుకున్నానని ఆడిన డ్రామాలకు గుర్తుగా హారన్లు మోగిస్తారా?

చంద్రబాబు అవినీతిని ఈడీ కూడా నిర్ధారించి నలుగురిని అరెస్టు చేసింది కాబట్టి.. ఢిల్లీలో దాక్కున్న లోకేష్.. ఈడీ ఆఫీసు ముందు నిలబడి కంచాలు కొడితే బాగుంటుంది.

రాష్ట్రపతి, మోడీ, అమిత్‌ షా కార్యాలయాల ముందు నిలబడి… టీడీపీ ఎంపీలు, దగ్గుబాటి పురందేశ్వరి, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, రేవంత్‌ రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్, రేణుకాచౌదరి, సత్యకుమార్, కూనంనేని సాంబశివరావు, జయప్రకాష్‌ నారాయణ, బీవీ రాఘవులు, వీళ్లందరినీ ఢిల్లీలో నిలబెట్టుకుని కంచాలు కొడితే బాగుంటుందని తెలిపారు.

ఈ రేంజ్ లో సాగిన అంబటి మాటల దాడికి టీడీపీ నుంచి రియాక్షన్ రాకపోవడం గమనార్హం. మరి ఈ రోజు రాత్రి ఏపీలో ఎన్ని కంచాలు మోగుతాయి, ఎన్ని విజిల్స్ ఊదబడతాయి, ఎన్ని హారన్స్ మోగుతాయి అనేది వేచి చూడాలి. ఆ కార్యక్రమం అనంతరం ఏమి సాధించారో టీడీపీ నేతలు చెబితే బాగుంటుందని అంటున్నారు పరిశీలకులు!