య‌న‌మ‌ల సింగ‌పూర్‌, అమ‌ర్‌నాథ్ రెడ్డి ప‌ల‌మ‌నేరు: తేడా తెలుసా?

చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే మన నాయకులు కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. ఇక ఆపరేషన్లకైతే చెప్పనక్కర్లేదు పొరుగింటి పుల్లకూర రుచి చందాన ఎయిర్ బస్ ఎక్కుతారు. ఫారెన్ డాక్టర్ల వైద్యానికే నయం అవుతుందేమో అన్నట్టు అక్కడ ఆపరేషన్ చేయించుకుని ప్రభుత్వ ఖజానాకి బిల్లులు పెడతారు. అయితే మంత్రి అమరనాధ్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా సొంత ఊరులోని గవర్నమెంట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

అమర్నాధ్ రెడ్డి తన ప్రసంగాలలో తరచూ కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ హాస్పిటల్స్ ధీటుగా మెరుగైన వైద్యం అందించగలవు అని చెబుతూ ఉంటారు. ఈ మాటను తానే స్వయంగా నిరూపించారు కూడా. ఆంధ్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాధ్ రెడ్డి ఈ నెలలో వారం రోజులపాటు విదేశీ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో ఉండగా ఆయనకు ఇన్ఫెక్షన్ కారణంగా కార్బంకుల్ (carbuncle ) కి గురయ్యారు.

 

విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడ శస్త్ర చికిత్స చేయించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన చేయించుకోలేదు. సొంత ఊరు పలమనేరుకి వచ్చి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మంత్రి ఇలా చేయటంతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపైన మరింత నమ్మకం పెరుగుతుందంటూ ఆ హాస్పిటల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మంత్రిని స్ఫూర్తిగా తీసుకుని కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆసుపత్రులు ధీటుగా ఉన్నాయని, మెరుగైన చికిత్స అందించగలవని నమ్మకంతో వైద్యం చేయించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరారు.

మంత్రి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న విషయం ఆనోటా ఈనోటా చేరి పట్టణం మొత్తం తెలిసిపోయింది. దీంతో అనుచరులు, ప్రజలు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. మంత్రి అమర్నాధ్ ఆపరేషన్ ఇక్కడ చేయించుకుని ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం పెంచుతుంటే, మంత్రి యనమల ఫారెన్ లో పంటి వైద్యం చేయించుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరిచారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎక్కడెక్కడి నుండో ఇండియాకి వచ్చి డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే యనమల రూట్ కెనాల్ సింగపూర్ లో చేయించుకోవడంపై విడ్డూరంగా ఉందంటున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. 12, ఏప్రిల్ 2018లో ఆయన సింగపూర్ లో ఉన్నారు. పెట్టుబడుల సమీకరణ కోసం ఆయన సింగపూర్ లో పర్యటించారు. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఏమంత ఎమర్జన్సీ వ్యవహారం కాదు. ఇండియాకు వచ్చి చేయించుకోవచ్చు. అయినా సరే ఆయన సింగపూర్ లోనే ప్రజాధనం నుండి 2,88,823 ఖర్చు చేసి రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకోవడం చర్చనీయాంశమయింది.

యనమల                                                                                                    అమర్నాధ్ రెడ్డి

ఈ ఇద్దరు నాయకుల వ్యక్తిత్వంలో ఉన్న వ్యత్యాసం గురించి ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకరు ఇంటి వైద్యమే బెటర్ అంటే మరొకరు పక్కింటి వైద్యానికే మొగ్గు చూపారు. అమర్నాధ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అందరికి ఆదర్శంగా నిలిస్తే మంత్రి యనమల ప్రజాధనాన్ని ఇలా ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. నాయకులందరూ అమర్నాథ్ రెడ్డిలా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుంటూ ఉంటె వైద్యులు కూడా బాధ్యతగా ఉంటారని, జనం కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడానికి మొగ్గు చూపుతారని ఆశిస్తున్నారు.