అమరావతి కేసు.. సుప్రీంకోర్టులో అదే పాత కథ.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయమై సుప్రీంకోర్టులో విచారణ కొన‘సాగు’తూ వస్తోంది. హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు ఎలాంటి ఊరటా లభించలేదు. హైకోర్టు తీర్పుపై స్టే లబిస్తే, రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళిపోదామనుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నేనూ విశాఖపట్నం వచ్చేస్తున్నా..’ అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించేశారు.

అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, ఉగాది పండగ కూడా విశాఖలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జరుపుకుని వుండేవారే. వచ్చ విద్యా సంవత్సరం నుంచి విశాఖలోనే పాలన జరుగుతుందంటూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గత ఏడాదే ప్రకటించారు. అయితే, సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు ఎలాంటి తీపి కబురూ అందలేదు. జులై 11 వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. అంటే, అప్పటిదాకా రాజధాని తరలింపుపై వైఎస్ జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. కేసులో చాలామంది వాదనలు వినాల్సి వుందంటూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

జులై 11న తొలి కేసుగా అమరావతి కేసుని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. కాగా, హైకోర్టు తీర్పుపై స్టే కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చాలా చాలా శ్రమించినా భంగపాటు తప్పలేదు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడంలేదు. మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి రావడంలేదు. వెరసి, రాజధాని సంక్షోభం కొనసాగుతూనే వుంది.