అమరావతి ఉద్యమానికి 1200 రోజులట.! ఏంటి ఉపయోగం.?

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, ప్రభుత్వం తమకు ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలంటూ ఆందోళనలు చేయాల్సి రావడం నిజంగానే దురదృష్టకరం. ఏ రాష్ట్రానికీ ఈ దుస్థితి రాకూడదు. ఏ రైతుకీ ఇలాంటి దుస్థితి ఎదురు కాకూడదు.! ఏ రాష్ట్ర రాజధానికీ ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి రాకూడదు.

అసలు అమరావతి విషయంలో టీడీపీ ఏం చేసింది.? అన్న లోతుల్లోకి ఇప్పుడు వెళ్ళడం అనవసరం. ఎందుకంటే, రాజధాని అమరావతికి అందరూ ‘ఓకే’ చెప్పారు. ‘అందరూ’ అంటే, అన్ని రాజకీయ పార్టీలూ అని అర్థం. అప్పుడు మద్దతిచ్చి, ఆ తర్వాత ప్లేటు ఫిరాయిస్తే.. అదీ రాజధాని విషయంలో మాట మార్చితే అంతకన్నా హేయం ఇంకేమీ వుండదు.

పోనీ, గడచిన నాలుగేళ్ళలో ఇంకో రాజధానిని అభివృద్ధి చేశారా.? అంటే అదీ లేదు. అమరావతిలో భూ కుంభకోణం.. అంటూ పాత పాటే మళ్ళీ పాడితే ఉపయోగం వుండదు. అమరావతి రైతులైతే 1200 రోజులుగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమంలో అలసిపోయారు కూడా. అయినాగానీ, పోరాడుతూనే వున్నారు.

ఇదిగో విశాఖ, అదిగో కర్నూలు.. అంటూ మూడు రాజధానుల నాటకాన్ని ఇంకా రక్తి కట్టించాలనుకోవడం వైసీపీ మూర్ఖత్వమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ మూడిటిలో ఒకటి అమరావతి గనుక, ఇప్పటికిప్పుడు ఆ అమరావతిపై ఫోకస్ పెడితే, వచ్చే ఎన్నికల్లో గెలిచి, మిగతా రెండిటిపై ఫోకస్ పెట్టడానికి ఆస్కారముంటుంది.

‘మూడు’ నాటకంతో వున్న ఒక్కదాన్నీ చెడగొట్టడం అర్థం లేని పని. ఇక, అమరావతి ఉద్యమంతో రైతులకేంటి ఉపయోగం.? అంటే, ప్చ్.. ఇప్పటికైతే ఏమీ లేదు. అలసిపోవడం తప్ప.!