పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ రివర్స్ గేర్.!

అదేంటో, మాట మీద నిలబడటం అస్సలు చేతకావడంలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి.! ఏదిఏమైనా, పొత్తులతోనే వచ్చే ఎన్నికల్ని ఎదుర్కొంటాం.. అని మొన్నీమధ్యనే పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జనసేన అధినేత పేర్కొన్న సంగతి తెలిసిందే.

పలు సందర్భాల్లో కూడా జనసేనాని, టీడీపీతో కలిసి పొత్తుకు వెళుతున్నామనీ, బీజేపీతో ఇప్పటికే పొత్తులో వున్నామనీ చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు తాజాగా ఆయన పొత్తులపై మాట మార్చారు. పొత్తులతో ముందుకు వెళ్ళాలా.? ఒంటరిగా వెళ్ళాలా.? అన్నది ఇప్పుడు అప్రస్తుతమంటూ జనసేన ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని.

వారాహి విజయ యాత్ర తొలి విడత జరిగిన నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జిలు, పరిశీలకులతో జనసేనాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారాహి విజయ యాత్ర రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కానున్న దరిమిలా, జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు.

చాలా చాలా ఆలోచించే, జనసేన పార్టీని స్థాపించడం జరిగిందనీ, అత్యంత వ్యూహాత్మకంగా వచ్చే ఎన్నికల్లో వ్యవహరిస్తామనీ, వారాహి విజయ యాత్ర తర్వాత జనంలో జనసేన గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందని జనసేనాని చెప్పుకొచ్చారు.

‘పొత్తుల గురించి ముందు ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే పొత్తులపై నిర్ణయాలుంటాయి. ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటంలో అర్థం లేదు..’ అని జనసేనాని వ్యాఖ్యానించడం గమనార్హం.