గతకొంతకాలంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వ్యవహారం అధికారపార్టీలో హాట్ టాపిక్ గా మారిందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని వాస్తవాలు కూడా లేకపోలేదు. లోకేశ్ పై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇవ్వడం.. అయితే ఆ హామీని నిలబెట్టుకోకపోవడం తెలిసిందే. దీంతో ఆర్కే అలిగారని, ఫ్యాన్ కిందనుంచి తప్పుకుంటున్నారని ఒక వర్గం మీడియా కథనాలు అందించింది.
అవును… జగన్ పై ఆర్కే అలిగారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మంగళగిరిలో చేనేత సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖుల్ని వైసీపీలో చేర్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆళ్లను కాదని, చేనేత నాయకుడికి టికెట్ ఇస్తారనే ప్రచారం గతకొన్ని రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలోనూ జరుగుతోంది. దీంతో ఆళ్ల అలకబూనారనే ప్రచారం తెరపైకొచ్చింది.
దీనికి బలం చేకురుస్తూ… ఇటీవల జగన్ నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యేల కీలక సమావేశానికి ఆళ్ల హాజరు కాకపోవడంతో… ఇక ఆళ్ల జగన్ కు బై బై చెప్పేస్తున్నారని కూడా కొన్ని కథనాలొచ్చాయి. ఇవి చాలవన్నట్లు… తాజాగా “మా నమ్మకం నువ్వే జగనన్నా..” కార్యక్రమానికి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరు కావడం లేదనే వార్తలొచ్చాయి. దీంతో తాజాగా మీడియా ముందుకొచ్చారు ఆర్కే.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 2024లో తిరిగి వైసీపీ జెండానే మంగళగిరిలో ఎగురుతుందని తెలిపారు. చంద్రబాబు పాలన అధ్వానంగా ఉండడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని, మంగళగిరిలో లోకేశ్ ను ఓడించారని చెప్పుకొచ్చారు. ఈ ఫ్లో కంటిన్యూ చేస్తూ… రానున్న ఎన్నికల్లో తమ నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకే నడుచుకుంటామని అన్నారు.
కాగా… మంగళగిరిలో లోకేశ్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో ఓడించిన సంగతి తెలిసిందే. మంత్రి హోదాలో లోకేశ్ మంగళగిరి బరిలో నిలిచి ఓటమి మూటకట్టుకున్నారు. నాటి నుంచి… వార్డు మెంబరు కూడా గెలవలేదంటూ లోకేష్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో… 2024లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి, గెలిచి టీడీపీకి గిఫ్ట్ గా ఇస్తానని లోకేశ్ శపథం చేసిన సంగతి తెలిసిందే.