సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థుల బలాబలాలను పరిగణలోకి తీసుకుని పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ సమయంలో సినీనటుడు అలీ విషయంలో కూడా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా ఇంతకాలం ఎంపీగా పోటీ చేస్తారని, లేదా.. రాజ్యసభకు పంపుతారంటూ కథనాలొచ్చిన వేళ… ఆలీని అసెంబ్లీకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారిన జిల్లాలోని కీలక నియోజకవర్గాన్ని అలీ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దీంతో… అలీపై జగన్ పెద్ద బాధ్యతే పెట్టారని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి గతకొంతకాలంగా ఆలీ పోటీ చేసే నియోజకవర్గాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని.. లేదు, ఆలీ తన సొంత ఊరు రాజమండ్రి నుంచే బరిలోకి దిగబోతున్నారని కథనాలొచ్చాయి. ఇదే సమయంలో నంద్యాల నుంచి ఆలీని పోటీకి నిలబెట్టే అవకాశాలున్నాయని గతంలో చర్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జగన్.. ఆలీ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా… ఆలీని నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోగా.. ఇటీవల రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని అంటున్నారు.
దీంతో.. నెల్లూరు జిల్లా విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని.. ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని.. అందుకే అభ్యర్థుల ఎంపికపై చాలా సీరియస్ గా ఆలోచిస్తూ, రకరకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే నెల్లురు సిటీ స్థానం నుంచి ఆలీని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం నెల్లురు సిటీకి సమన్వయ కర్తగా డిప్యూటీ మేయర్ ఖలీ ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు! దీంతో… పోటీ బలంగా ఉండే నేపథ్యంలో ఆలీ అయితే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా… నెల్లూరు సిటీ స్థానం నుంచి మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ 3 సార్లు పోటీ చేసి, రెండు సార్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనీల్… పీఆర్పీ అభ్యర్థిపై 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 2014, 19 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి వరుసగా రెండుసార్లూ గెలిచారు. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే!