Auto Drivers: ఆటో డ్రైవర్లకు అలర్ట్.. రూ.15,000 రావాలంటే ఇవి ఉండాల్సిందే

auto drivers

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో ఆటోడ్రైవర్లను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.15000 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. పథకానికి అర్హతలను రవాణాశాఖ జీవోలో పేర్కొంది. ఈనెల 13వ తేదీ నాటికి పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసింది. ఈనెల 22న సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పరిశీలన చేయనున్నారు. అనంతరం ఈనెల 24వ తేదీ నాటికి తుది జాబితాను సిద్ధం చేస్తారు. తుది జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15వేలు అక్టోబర్ 1న వేయనుఎంది. గత వైసీపీ ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 2025-26 ఆర్థిక సంవత్సరాలనికి సంబంధించిన విధివిధానాలు ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అర్హతలు ఇవే..

* ఏపీ రిజిస్ట్రేషన్‌తో వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
* డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
* దరఖాస్తుదారులు దారిద్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
* ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే నెల లోపు సమర్పించాలి.
* మాగాణి అయితే మూడు ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
* పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస, వానిజ్య నిర్మాణం ఉండకూడదు.
* దరఖాస్తుదారు లేదా కుటుంబసభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/ పెన్షనర్‌గా ఉంటే అనర్హులు అవుతారు.
* పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
* కరెంట్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
* వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.