పాపం, మంత్రి అఖిలప్రియ పెళ్లి…అంతులేని విషాదం

అఖిల ప్రియ… తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈమె గురించి తెలియనివారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కూతురిగా, ఆంధ్ర మంత్రిగా ఈమె అందరికి సుపరిచితురాలే. ఆంధ్ర రాష్ట్రంలో వీరి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

bhuma family

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోవడంతో పెద్ద కూతురిగా ఇంటి బాధ్యతలు కూడా ఆమే నిర్వర్తిస్తున్నారు.

శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిల రాజకీయ వారసురాలిగా తల్లిదండ్రుల బాటలోనే పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ఆళ్లగడ్డలో మంచి పేరు తెచ్చుకున్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆళ్లగడ్డ ప్రజలకు చేరువయ్యారు.

బుధవారం అఖిలప్రియ పెళ్లి. గత కొంతకాలంగా అఖిలప్రియ, పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్ నాయుడు ప్రేమలో ఉన్నారు. ఆగస్టు 29 న పెళ్లితో ఒక్కటయ్యారు. ఆమె తల్లిదండ్రుల మరణం తర్వాత వారి కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది.

ఈ వేడుకకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పైగా అఖిల ప్రియ మంత్రి కావడంతో ఏర్పాట్లు చాలా ఆడంబరంగా జరిగాయి. లారీ లోడు శుభలేఖలు పంచారంటే ఆ ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేసి ఉంటారో ఊహించుకోవచ్చు.

 

ఆళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టలో భూమా శోభానాగిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వీరి పెళ్లి వేడుకకు వేదిక అయింది. పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బీవీరామిరెడ్డి.

పెళ్ళికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, మంత్రి లోకేష్, ఇరు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిపి 50 వేల మంది వరకు హాజరు కావచ్చని ఊహించారు.

కానీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో కలలన్నీ తారుమారయ్యాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, టీడీపీ నేతలు, అధికారులు అందరూ హరికృష్ణ మరణ వార్త తెలియగానే భౌతిక ఖాయాన్ని చూడటానికి వెళ్లారు. చావు ఇంటికి వెళ్లి పెళ్ళికి వెళ్లరు కాబట్టి అఖిల ప్రియ పెళ్ళికి రాజకీయ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. 

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలోనూ మధురమైన అనుభూతి. ఎన్నో ఆశలు, కలలు, కోరికలు పెళ్లిపై పెట్టుకుంటారు వధూవరులు. ఆ పెళ్లి తమ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంలా ఉండాలి అనుకుంటారు. కానీ అఖిలప్రియకు ఈ విషయంలో కొంత బాధ మిగిలిందని తెలుస్తోంది.

తండ్రి చనిపోయినప్పటి నుండి అఖిల ప్రియ కుటుంబానికి అండగా నిలబడ్డారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కరే కాదు పార్టీలో ఎంతోమంది ఆమెకు రాజకీయంగా సపోర్టుగా నిలిచారు. అటువంటి ఆత్మీయులు తన పెళ్ళికి వచ్చి ఆశీర్వదించాలని ఆమె అనుకున్నారు కానీ ఆశ నిరాశ అయింది.

 

కోరుకున్న చెలికాడే వరుడు అయినప్పటికీ కొండంత అండగా ఉన్న ముఖ్యమైన అతిధులు, జిల్లా ప్రజలు కూడా ఆకస్మికంగా అలుముకున్న విషాదం కారణంగా ఆమె పెళ్ళికి వెళ్లి ఆశీర్వదించలేని పరిస్థితి. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ప్రభుత్వం.

ఈ రెండు రోజులు ఎటువంటి కార్యక్రమాలు ఆర్భాటంగా జరగటానికి వీలు లేదు. అఖిలప్రియ మంత్రి కావడంతో ఆమె పెళ్లి కూడా సింపుల్ గా జరపాల్సి వచ్చింది. దీంతో అత్యంత ఆప్తులమధ్య అఖిల ప్రియ పెళ్లి సాదా సీదాగా జరిగినట్టు తెలుస్తోంది.