సీబీఐ ఎవర్ని విచారిస్తుందో.. ఎలా విచారించిందో.. అన్ని విషయాల్నీ పూసగుచ్చినట్లు వివరించేస్తున్నారు ఏబీఎన్ రాధాకృష్ణ. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ, రాజకీయాలకు సంబంధించి చెప్పే జోస్యాలు కొన్ని నిజమవడం తెలిసిన విషయమే.
కానీ, సీబీఐ వ్యవహారాల్ని కూడా ఆయన అంతలా ఎలా ముందే చెప్పేయగలుగుతున్నట్లు.? వైఎస్ వివేకా డెత్ మిస్టరీకి సంబంధించి అజేయ కల్లాం, సీబీఐ విచారణ ఎదుర్కొన్నారట. ఈ సందర్భంలో కొన్ని కీలక విషయాల్ని సీబీఐకి అజేయ కల్లాం తెలియజేశారట. ఇదీ ఇటీవల ఏబీఎన్ రాధాకృష్ణ వెల్లడించిన వార్తా కథనం.
దీనిపై అజేయ కల్లాం స్పందించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నత పదవుల్ని అలంకరించారాయన. అలాంటి వ్యక్తి మీద వార్తా కథనాలు రాసేటప్పుడు, పక్కా ఆధారాలుండాలి కదా.? అజేయ కల్లాం ఈ విషయమై గుస్సా అవుతున్నారు.
తప్పుడు రాతలు ఎందుకు రాశారో తనకు అర్థం కాలేదంటూ ఏబీఎన్ రాధాకృష్ణ మీద మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు, వైఎస్ జగన్ సమక్షంలో తామంతా కాకతాళీయంగా కలిశామనీ, వివేకా మరణ వార్త అక్కడే తెలిసిందనీ, జస్ట్ మరణ వార్త మాత్రమే తెలిసిందని అజేయ కల్లాం చెప్పుకొచ్చారు.
‘నాకు తెలిసిన విషయాల్ని సీబీఐకి వెల్లడించాను. అలాంటి విషయాలు ఎలా లీక్ అవుతున్నాయి.?’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు అజేయ కల్లాం. మరి, ఈ విషయమై న్యాయ పోరాటానికి అజేయ కల్లాం వెళతారా.?