2024 ఎన్నికలు.! వైసీపీకే అడ్వాంటేజ్‌.. కానీ.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. కోస్తా, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణం ఒకింత భిన్నంగా కనిపిస్తోంది. ఎవరు అధికారంలోకి వస్తారు.? అన్నదానిపై రకరకాల వాదనలు తెరపైకొస్తున్నాయి.

టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమైపోయింది. బీజేపీ, వామపక్షాలు.. అంటే, జస్ట్ ఆటలో అరటి పండు మాత్రమే. అధికార వైసీపీ, ప్రస్తుతానికి పూర్తి బలంతో వుంది. వైసీపీకి తిరుగులేదు.. అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

రాజకీయాల్లో పొత్తులంటే ‘వన్ ప్లస్ వన్’ అనగానే రెండు అనే సమాధానం ఇచ్చేస్తే కుదరదు. ఒక్కోసారి ఒకటీ ప్లస్ ఒకటి.. జీరో కూడా అవ్వొచ్చు.! టీడీపీ – జనసేన పొత్తు విషయమై ఇలాంటి చర్చలూ జరుగుతున్నాయి.

కానీ, టీడీపీ – జనసేన కలిస్తే, జీరో అయ్యే ప్రసక్తే లేదు. కానీ, బీజేపీ గనుక వైసీపీతో జతకలిస్తే, ఖచ్చితంగా రాజకీయాలు రసవత్తరంగా మారతాయ్.! ఆ దిశగానే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ అధినాయకత్వంతో టచ్‌లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీ వల్ల టీడీపీ – జనసేనకు లాభం లేదు. అదే బీజేపీ గనుక వైసీపీతో కలిస్తే.. టీడీపీ – జనసేన కూటమికి ఇబ్బందులు తప్పవు. అరెస్టులు, జైలు.. ఇలాంటి వ్యవహారాల్లో అన్నమాట.! అది రాజకీయ పార్టీల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది.

చంద్రబాబు జైల్లో వుండటం వల్ల, టీడీపీకి తొలుత కొంత మైలేజ్ పెరిగింది. కానీ, ఇప్పుడది తగ్గుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఓ వైపు సినిమాలు చేస్తూ.. ఇంకో వైపు రాజకీయం చేస్తుండడంతో.. ఇక్కడా జనసేనకు అడ్వాంటేజ్ ఏమీ కనిపించడంలేదు.

వైసీపీ చేసే స్వంయకృతాపరాధాలే.. ఆ పార్టీకి శాపమవ్వాలి తప్ప, టీడీపీ – జనసేన కూటమి వల్ల వైసీపీకి మరీ అంత పెద్ద ముప్పేమీ లేదేమో.. అని తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. కానీ, వైసీపీ స్వయంకృతాపరాధాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయ్.. చంద్రబాబు అరెస్టు, పవన్ కళ్యాణ్ మీద సీఎం జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు వంటివి.