నెల్లూరు రాజకీయాల్లో ఏంటీ పెళ్ళిళ్ళు.. విడాకుల గోల.?

ఒకరేమో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు.. ఇంకొకరేమో, పెళ్ళికి ముందర ప్లేటు ఫిరాయించారు.! నెల్లూరు జిల్లాలో ఇప్పుడీ రాజకీయ పెళ్ళిళ్ళ గోల గురించి జనం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికీ, వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికీ మధ్య మాటల యుద్ధం సందర్భంగా ‘రాజకీయ పెళ్ళిళ్ళ’ అంశం హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

రాజకీయాలన్నాక నాయకులు పార్టీలు ఫిరాయించకపోతే ఎలా.? రాజకీయం అంటేనే కప్పల తక్కెడ వ్యవహారం. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో వుంటారో చెప్పలేం. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా రకాలుగా తిట్టిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు తదితరులు ఇప్పుడు వైసీపీలోనే వున్నారు.

ఇక, ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయానికొస్తే, ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలి. టిక్కెట్టు ఖరారయ్యాక.. చివరి నిమిషంలో ఆయన పార్టీ మారారు. దీనిపై కోటంరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి ఫిక్సయ్యాక.. పీటల మీద నుంచి పెళ్ళికొడుకు లేచిపోయాడన్నది కోటంరెడ్డి ఉవాచ.

కోటంరెడ్డి అయితే, వైసీపీతో పెళ్ళయ్యాక.. మధ్యలో ఆ వివాహ బంధాన్ని తెంచేసుకున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. అయినా, ఈ రోజుల్లో సాధారణ పెళ్ళిళ్ళు కూడా ఇలాగే తయారయ్యాయ్.. ఇందులో వింతేముంది.?అన్నట్టు, ఆదాల విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరీ ఎక్కువ నమ్మకం పెట్టేసుకుంటున్నారు.

పార్టీ మారడం ఆయనకు కొత్తేమీ కాదు. కాస్తో కూస్తో కోటంరెడ్డి నయం.. ఈ విషయంలో. అన్నట్టు, కోటంరెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారట.? టీడీపీ నుంచి పోటీ చేస్తానంటున్నారుగానీ.. టీడీపీ ఆయన్ని నమ్ముతుందా.?