నారా లోకేష్ ఈజ్ ఈక్వ‌ల్ టు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌

ఏపీ మంత్రి నారా లోకేష్‌ను స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ ద‌ళ‌ప‌తి నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌తో పోల్చారు ఓ మాజీ న‌టి క‌మ్ టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు. వారిద్ద‌రూ ఒకేరోజు జ‌న్మించ‌డం ప‌ట్ల ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బుధ‌వారం నేతాజీ జ‌యంతి. 1897 జ‌న‌వ‌రి 23వ తేదీన నేతాజీ జ‌న్మించారు. 1983 జ‌న‌వ‌రి 23న నారా లోకేష్ పుట్టారు. వారిద్ద‌రి పుట్టిన‌రోజు ఒక‌టే.

దీన్ని బేస్ చేసుకుని, నారా లోకేష్‌ను ఏకంగా నేతాజీతో పోల్చారు మాజీ న‌టి దివ్య‌వాణి. అక్క‌డితో ఆగారా లేదే. పుట్టినరోజు నాడు కుటుంబ స‌భ్యులతో గ‌డ‌ప‌కుండా రాష్ట్రం కోసం కృషి చేస్తున్నార‌ని చెప్పారు. పెట్టుబ‌డుల కోసం దావోస్‌లో ప‌ర్య‌టిస్తున్నార‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తి లోకేష్‌లో క‌నిపిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ఇంత చిన్న వయస్సులో ఆయ‌న నిత్యం కష్టపడుతున్నార‌ని ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు, లోకేష్ వంటి నాయ‌కులు దొర‌క‌డం మ‌న అదృష్ట‌మ‌ని చెప్పారు.