అచ్చెన్నకు విలువిచ్చిన టీడీపీ శ్రేణులు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఏపీలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు జరగలేదని. అసలు టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి రాలేదని, పార్టీకి చంద్రబాబు అరెస్ట్ కంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉండదని, ఈ రోజైనా టీడీపీ నేతలు జనసమీకరణ చేయాలని, రోడ్లపైకి రావాలని అచ్చెన్నాయుడు విన్నవించిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన ఆడియో ఒకటి లీకవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అచ్చెన్నాయుడు మాటకు టీడీపీ శ్రేణులు విలువిచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా అరెస్ట్ చేసిన శనివారం స్థబ్ధగా ఉన్న టీడీపీ శ్రేణులు… ఈ రోజు మాత్రం రోడ్లపైకి వచ్చి కాస్త సందడి చేశారు.

ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గంపలగూడెం, మైలవరం, అవనిగడ్డ, చందర్లపాడు, గుడివాడ, పొన్నూరు, మందడం, రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెం శిబిరంలో పార్టీ శ్రేణులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. ఇదే స్మయంలో పామర్రులోని పార్టీ కార్యాలయంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజధాని ప్రాంతంలో మహిళలు, రైతులు నిరసన తెలిపారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ మందడంలో రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా అమరావతి రూపశిల్పిపై అక్రమంగా అవినీతిని అంటగడుతున్నారని రైతులు ఆరోపించడం గమనార్హం.

ఇదే క్రమంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్‌ లో టీడీపీ శ్రేణులు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టాయి. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సామూహిక నిరాహార దీక్ష ప్రారంభించారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే… టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. సరైన కారణాలు చూపకుండా.. దురుద్దేశంతో జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్టుచేసిందని ఆరోపించారు.