అచ్చెన్న కూడా బుద్దులు చెబుతున్నారు

ఇదే విచత్రంగా ఉంది చూస్తున్నవాళ్ళకు. అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి తరపున అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తనను రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అసభ్యంగా దూషించారంటూ గోల మొదలుపెట్టారు. వెంటనే మంత్రి సమాధానమిస్తు తాను అచ్చెన్నను ఏమీ దూషించలేదని అయినా తన మాట వల్ల సభ్యుడు బాధపడితే తాను అన్నట్లు చెబుతున్న మాటను ఉపసంహరించుకుంటానని స్పీకర్ తో చెప్పారు.

నిజానికి ఇక్కడే ఇష్యు ముగిసిపోవాలి. కానీ టిడిపికి సభ సజావుగా సాగటం ఇష్టం లేనట్లుంది చూస్తుంటే. అందుకనే మంత్రి మాటలను పట్టుకుని బాగా లాగారు. మొత్తానికి స్పీకర్ కటువుగా వ్యవహరించి సభను ఆర్డర్లో పెట్టారనుకోండి అది వేరే సంగతి. కానీ టిడిపి సభ్యుల వైఖరి మీదే అందరికీ అనుమానంగా ఉంది.

అధికారంలో ఉన్నపుడు చాలామంది మంత్రులు, చీఫ్ విప్, ఎంఎల్ఏలతో పాటు అచ్చెన్న కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఏ విషయం మీద జగన్ మాట్లాడాలని లేచినా వెంటనే జగన్ వ్యక్తిగతాన్ని కించపరుస్తు లేదా తాగ వైఎస్ రాజారెడ్డి హంతకుడని, హత్యా రాజకీయాలను తెరమీదకు తెచ్చింది అందరికీ గుర్తుండే ఉంటుంది.

అప్పట్లో జగన్ పై నోటికొచ్చినట్లు మంత్రులు మాట్లాడటాన్ని సభలో ఉన్న చంద్రబాబునాయుడు కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. అదే విషయం ఇపుడు రివర్స్ అయ్యేసరికి టిడిపి ఎంఎల్ఏలు తట్టుకోలేకున్నారు. ఇంకా జగన్ కానీ మంత్రులు కానీ చంద్రబాబును పర్సనల్ గా టార్గెట్ చేయకుండానే. నోటికొచ్చినట్లు మాట్లాడిన అచ్చెన్న కూడా ఇపుడు సభలో వల్గర్ గా మాట్లాడటం, సభా సంప్రదాయాలు, నైతిక విలువలు, సభ్యత, సంస్కారం గురించి లెక్చర్లు ఇస్తుండటమే విచిత్రంగా ఉంది.