ఈ ఆధునిక కాలంలో అనేక మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువమంది ఆన్లైన్ లోనే తమ సమయాన్ని గడుపుతున్నారు. ఇలా ఆన్ లైన్ యాప్ ల ద్వారా మోసపోవడం కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నాము. ఏదో మాయమాటలు చెప్పి అకౌంట్ లలోని డబ్బులను కాజేయడం చూస్తుంటారు. ప్రతి మనిషిలోనూ ఒక వీక్ నెస్ ఉంటుంది, ఆ వీక్ నెస్ ని వీరికి అనుకూలంగా మలచుకొని డబ్బుని కాజేస్తున్నరు. ఇలా ఒక లేడీ యువకుడికి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, అతడిని తన మాటలతో నమ్మబలికి ఏకంగా 46 లక్షల రూపాయలు కాజేసింది. చివరకు తాను మోసపోయిన విషయం తెలుసుకున్న ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన 29 సంవత్సరాల అపర్ణ అలియాస్ శ్వేత స్థానికంగా ఉండే ఒక అనాథ శరణాలయం లో పని చేసేది. కొన్ని కారణాల వలన అనాథ శరణాలయం మూసివేయడం తో, ఆమె ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దీంతో డబ్బు సంపాదించడానికి ఫేస్ బుక్ ని వేదికగా చేసుకుంది. అమాయకమైన పెళ్లి కాని యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికి వారి నుండి డబ్బులు దండుకునేది. ఈ తరుణంలో రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకుంది. అనంతరం చాటింగ్ చేస్తూ.. ఆ పరిచయం కాస్త పెరిగి ఫోన్ నంబర్లను మార్చుకునే వరకు వెళ్ళింది.
ఆ యువకుడు అంటే తనకు ఇష్టం అని తనను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికింది. పెళ్లి చేసుకుందాం అని ఆ యువకుడునినమ్మించింది. అయితే తమకు పెళ్లి అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అని ఆ యువకుడికి చెప్పిన శ్వేత… తన పేరు మీద ఒక 7 కోట్ల రూపాయల భీమా ఉంది అని తెలిపింది. అయితే ఆ డబ్బుని తీసుకోవడానికి మొదటగా తను కొంచెం డబ్బుని చెల్లించాలని ఆ యువకుడికి చెప్పింది శ్వేత. ఆ మాయ లేడీ నమ్మిన యువకుడు విడతల వారీగా ఆమె అకౌంట్ కి 46 లక్షలు డిపాజిట్ చేశాడు.
ఆ డబ్బు తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే, ఆ యువకుడు శ్వేత ని తాను ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడగడంతో శ్వేత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో తాను మోసపోయాను అని తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ చేపట్టిన రాచకొండ సైబరాబాద్ పోలీసులు శ్వేత ను అదుపులోకి తీసుకున్నారు. తన వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, ఓ ట్యాబ్ ని స్వాధీనం చేసుకున్నారు.