ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నెక్స్ ట్ ప్లాన్ ఏంటి? శాశ్వతంగా చంద్రబాబును ఏపీలో గెలవకుండా చేయాలి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలి. టీడీపీ ఏపీలో నామరూపం లేకుండా కావాలి. అంతే కదా.. ఏ పార్టీ అయినా ఇతర పార్టీల గురించి ఆలోచించేది ఇదే. అలా అయితే.. ఆయా పార్టీలకు బతుకు. లేదంటే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. మరో 20 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీనే అధికారంలో ఉండాలంటే మాత్రం వైసీపీ ముందు చేయాల్సింది చంద్రబాబును అచేతనుడిని చేయడం.
అంటే.. చంద్రబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఇప్పుడు కాదు.. 1989 నుంచి ఆయన తన నియోజకవర్గం కుప్పం నుంచి గెలుస్తూనే ఉన్నారు. మొన్న 2019 ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలంటే ముందు చంద్రబాబు గెలవకూడదు.. అన్న ఫార్ములాను నెక్స్ ట్ వైసీపీ ఉపయోగించబోతోంది.
2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే.. చంద్రబాబును కూడా తన సొంత నియోజకవర్గంలో ఓడించాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించడం కోసం.. వైసీపీ ఇప్పటి నుంచే పథకాలను రచిస్తోందట.
అందుకే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ. ఆయనతో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కేవలం కుప్పం మీదనే దృష్టి పెట్టారు.
గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి మృతి చెందడంతో.. కుప్పం పగ్గాలను ఆయన కొడుకుకే ఇచ్చింది వైసీపీ. గత ఎన్నికల్లో చంద్రమౌళిపై చంద్రబాబు గెలిచింది 30 వేల మెజారిటీతోనే. అంటే.. కొంచెం కష్టపడితే కుప్పంలో బాబును ఓడించడం పెద్ద కష్టం కాదు అని భావించిన వైసీపీ.. కుప్పం మీద ఫోకస్ పెంచేసింది.
వైసీపీ ప్లాన్లు వేయడమే కాదు.. దాన్ని ఆచరిస్తోంది కూడా. బహిరంగంగానే చంద్రబాబును ఓడిస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించకపోతే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. అంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఫోకస్ ఎక్కువగా కుప్పంపైనే ఉండబోతోందని తెలుస్తోంది.