ఏలూరులో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కిందపడి మరణించిన ప్రధానోపాధ్యాయుడు..!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని అనుకోని ప్రమాదాల వల్ల నిమిషాలలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఏలూరులో జరిగిన ప్రమాద సంఘటన వల్ల ప్రధానోపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు.పిల్లలకు
అందించాల్సిన బూట్లను తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించాడు.

వివరాలలోకి వెళితే…ఏలూరులో నివాసం ఉంటున్న జక్కుల రాజశేఖర్‌ (51) అనే వ్యక్తి పెదవేగి మండలం చింతలపాటివారిగూడెం ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య అరుణ ప్రసన్న పెదవేగి మండలంలోని కొప్పాకలోని ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. ఇదిలా ఉండగా ఇటీవల గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న బూట్లను తీసుకొచ్చేందుకు తన ద్విచక్రవాహనంపై పెదవేగిలోని ఎంఈవో కార్యాలయానికి బయలుదేరారు. ఎంఈవో కార్యాలయం నుండి బూట్లు ఉన్న గోనెసంచిని తన ద్విచక్రవాహనంపై ముందు పెట్టుకొని వస్తుండగా రాయన్నపాలెం గ్రామంలో గోనెసంచి హ్యాండిల్‌కు అడ్డుపడటంతో అదుపుతప్పి కిందపడి పోయారు.

అయితే అదే సమయంలో అటుగా వస్తున్న ట్రాక్టర్‌.. ప్రధానోపాధ్యాయుడు తల మీదుగా వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసుల కోసం సమాచారం అందించగా పోలీసులు ప్రమాదస్వరానికి చేరుకొని రాజశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ మరణ వార్తను అతని భార్య అరుణకి తెలియచేయటంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనపై ఉపాధ్యాయుల సంఘాలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసామగ్రి పంపిణీ, ఇతర కార్యక్రమాలతో ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి పెరిగిందని, రాజశేఖర్‌ మృతికి అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.