పవన్ కు మహిళా కమిషన్ నోటీసులు… డెడ్ లైన్ ఫిక్స్!

వాలంటీర్ల పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు పవన్‌ కల్యాణ్ కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్‌ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్‌.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది.

అవును… ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ కు నోటీసులు జారీ చేసింది. ఈ వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. అలాకానిపక్షంలో క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ ప‌ర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్‌ కు నోటీసులు ఇచ్చిన విష‌యం వెల్లడించారు. దీనిపై మ‌హిళా క‌మిష‌న్‌ కు వాలంటీర్ల నుంచి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వ‌స్తున్నాయ‌ని ఆమె తెలిపారు. పవన్ చెబుతున్నట్టుగా తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్‌ ప‌ర్స‌న్ డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్‌ తప్పించుకోలేరని విమర్శించిన వాసిరెడ్డి పద్మ… వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందని అన్నారు. పవన్‌ చెప్తున్న 30 వేల మిస్సింగ్‌ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువత చెడిపోవడానికి పవన్‌ సినిమాలే కారణమని ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ దుయ్యబట్టారు.

మరోవైపు పవన్‌ అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టారు. పవన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా… ఆదివారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన జనసేన వారాహి యాత్ర సభలో పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని, వసీపీ పాలనలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఆ విషయం తనకు కేంద్రంలోని నిఘా వ్యవస్థ ద్వారా తెలిసిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.