బాత్ రూం సింగర్స్ కి గుడ్ న్యూస్… యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్!

ఈ రోజుల్లో ఎక్కువమంది వాడుతున్న యాప్స్‌ లో యూట్యూబ్ కూడా ఒకటి. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి నిద్రపోయేవరకూ కూడా ఆ యాప్ లో ఉండేవారి సంఖ్య కూడా తక్కువేం కాదని చెబుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ యాప్ యూజర్ల సంఖ్య అధికంగానే ఉంటుంది.

ఈ క్రమంలో యూట్యూబ్ యూజర్లు ఇస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ ను అనుసరించి యూట్యూబ్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అత్యంత ఆసక్తిగా ఉన్న ఆ ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం!

సాధారణంగా ఏదైనా ఒక సాంగ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ పాట లిరిక్స్ సడన్ గా గుర్తుకురావు. ఆ సమయంలో బాత్ సింగర్స్ లా తెగ హం చేస్తూ తెగ ఆలోచించేస్తుంటారు. అలాంటివారికి ఇబ్బందిలేకుండా .కొత్త ఫీచర్ తీసుకురానుంది యూట్యూబ్!

అవును… యూట్యూబ్ లో సాంగ్స్‌ ను మరింత ఈజీగా సెర్చ్ చేసుకునేలా యూట్యూబ్ సాంగ్‌ సెర్చ్‌ అనే ఫీచర్‌‌ ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌ తో యూజర్లు తమకు కావాల్సిన పాటను ఈజీగా వెతకొచ్చు. యూట్యూబ్‌ లోని వాయిస్‌ సెర్చ్‌ ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీంతో లిరిక్స్ గుర్తులేకపోయినా.. జస్ట్ హమ్‌ చేసి పాటను పొందొచ్చు!

ఈ సమయంలో యూజర్లు తమకు కావల్సిన పాట కోసం మైక్‌ సింబల్‌ పై క్లిక్ చేసి మూడు సెకన్ల పాటు ట్యూన్‌ ను హమ్‌ చేస్తే సరిపోతుంది. యూట్యూబ్.. ఆ పాట లేదా మ్యూజిక్‌ ను గుర్తించి, దానికి సంబంధించిన రిజల్ట్స్‌ ను చూపిస్తుంది.

2020 లో గూగుల్‌ తీసుకొచ్చిన “హమ్‌ టు సెర్చ్‌” ఫీచర్‌ ను ఆధారం చేసుకుని యూట్యూబ్ ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు పేర్కొంది. గూగుల్ హమ్‌ టు సెర్చ్‌ లో 15 సెకన్ల పాటు ట్యూన్‌ ను హమ్‌ చేయాలి. అయితే యూట్యూబ్‌ లో కేవలం మూడు సెకన్లు హమ్‌ చేస్తే చాలు.

ఇకపోతే యూట్యూబ్‌ లో వీడియో చూస్తున్నప్పుడు యాడ్స్ రాకుండా కొంతమంది యాడ్ బ్లాకర్ల వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ ను వాడుతుంటారు. అయితే రీసెంట్‌ గా యూట్యూబ్ దానికి చెక్ పెట్టింది. ఇందులో భాగంగా… యాడ్ బ్లాకర్స్ వంటి ఎక్స్‌టెన్షన్లు ఉంటే అసలు వీడియోలే ప్లే అవ్వకుండా సెక్యూరిటీ అప్‌డేట్ చేసింది.