సంక్షేమ పథకాల అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో మేనిఫేస్టో లో చెప్పిన పథకాలు ఎనభైశాతం పూర్తిచేసారు. ఇంకా మరెన్నో కొత్త పథకాల్ని తెరపైకి తీసుకొచ్చి అమలు చేసారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఫలాలు అదించామని చెప్పి మరీ చేసారు. ఏడాదిగా సంక్షేమ పథకాల అమలుపైనే ప్రత్యేకంగా దృష్టిసారించి పనిచేసి పాలనలో తనదైన మార్క్ వేసారు. జగన్ మాట తప్పడు..మడమ తిప్పడని ఏడాదిలోనే నిరూపించుకున్నారు. తాజాగా పొదుపు సంఘాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
అధికారంలోకి రాగానే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల అప్పుల్లో ఆసరాగా నిలుస్తామని వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం తొలి విడత రుణాల చెల్లింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు27, 168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. దీనిలో భాగంగా తొలి ఏడాది రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేసింది. ప్రతీ ఇంటికి కార్యక్రమం చేరేలా ప్రభుత్వం వారోత్సవాలు కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రతీ మహిళ పాల్గొనాలని మంత్రి పిలుపునివ్వడం జరిగింది.
వైఎస్సార్ ఆసరాపై పొదుపు సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. కష్టకాలంలో ఈ సహాయం సంఘాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి కరోనా లాంటి కష్టకాలంలోనూ పథకాల స్పీడ్ ఏ మాత్రం తగ్గించలేదని నిరూపించారు. దాదాపు ఆరు నెలల నుంచి రాష్ర్ట ప్రజలు కరోనా భయంతో ఇళ్లు కదల్లేని పరిస్థితులు. చేసుకోవడానికి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులతో కుటుంబాన్ని సాకాల్సిన పరిస్థితులు. ఇలాంటి సమయంలో వైఎస్సార్ ఆసరా పొదుపు సంఘాలకు కొండంత అండలా నిలబడింది.