టీడీపీతో పొత్తు… “సీఎం పోస్ట్” డిమాండ్ చేస్తున్న పవన్!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ – జనసేన పొత్తు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి బీజేపీతో జనసేన పొత్తులో ఉందో లేదో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో… జనసేన – టీడీపీ కలిస్తేనే బెటరని, కలవకపోతేనే మేలని రెండు పార్టీల్లోనూ భిన్నవాదనలున్న సంగతి తెలిసిందే. అయితే… కలిసినా కూడా 20 – 25 మించి ఇవ్వద్దనేది టీడీపీలో అన్ని వర్గాల వాదన కాగా… అంత దిగజారితే మంచిది కాదని జనసేన నేతల అందరి భావన. ఈ సమయంలో… పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది!

గతంలో… జనసేనకు కేవ‌లం 20-25 సీట్లు మాత్ర‌మే ఇవ్వ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని ప‌వ‌న్.. బందరు మీటింగులో వేడుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మాభిమానాన్ని ఏ మాత్రం తాక‌ట్టు పెట్ట‌న‌ని పవన్ ఇప్పటికే స్ప‌ష్టం చేశారు. ఈ క్రమంలో… తాజాగా జ‌న‌సేన నేత‌లు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు త‌దిత‌రుల‌తో.. టీడీపీ ముఖ్య నేత‌లు హైద‌రాబాద్‌ లో స‌మావేశం అయ్యిన‌ట్టు తెలిసింది! ఈ భేటీలో జ‌న‌సేన త‌న డిమాండ్స్‌ ను నిర్మొహ‌మాటంగా టీడీపీ ముందు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల స‌మాచారం.

అవును… పొత్తుల వ్యవహారంలో నాన్ చుడు ధోరణి వద్దని ఫిక్సయిన టీడీపీ ముఖ్య నేతలు.. తాజాగా జనసేన పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్స్ లో సూటిగా మాట్లాడిన పవన్… తనకు రెండేళ్ల ముఖ్యమంత్రి ప‌ద‌వి, అదేవిధంగా 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని తేల్చేశారంట. ఇక ఎంపీ సీట్ల విషయంలో.. మీరెన్నిస్తే అన్నే తీసుకుంటామని కూడా చెప్పారంట. దీంతో… షాక్ తిన్నారంట టీడీపీ నేతలు.

రెండేళ్ల పాటు సీఎం ప‌ద‌వి, 50 అసెంబ్లీ సీట్లు జనసేన కిచ్చేస్తే… తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే 175 స్థానాల్లోనూ ఇద్దరేసి టీడీపీ నేతలు టిక్కెట్లకోసం హోరాహోరీగా తలపడుతుంటే… దానికి తోడు… 50 అసెంబ్లీ స్థానాలు జనసేనకు త్యాగం చేయడం జరిగేపని కాదని టీడీపీ నేత‌లు అనుకున్నార‌ట‌. 20వరకూ తమ చేతుల్లో ఉంది.. బాబుతో కలిస్తే పాతికకు ఒప్పుకోవచ్చు. అంతకు మించి అరసీటు కూడా ఇవ్వలేమని టీడీపీ నేతలు చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే… జనసేనాని మాత్రం త‌న గౌర‌వాన్ని, పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని త‌గ్గించుకునే విషయంలో తగ్గేదేలే అంటున్నారట. ఈసారి అధికారంలోకి రావ‌డానికి త‌మ‌తో టీడీపీకే ఎక్కువ రాజ‌కీయ అవ‌స‌రం వుంద‌ని.. అలాంట‌ప్పుడు ప్ర‌తిసారి జ‌న‌సేన ఎందుకు త‌గ్గాల‌ని పవన్ ఫిక్సయినట్లు సమాచారం. అవసరం ఇద్దరిదీ అయినప్పుడు… ప్రతిఫలం మాత్రం ఒక్కరే పొందాలనుకోవడం కరెక్ట్ కాదని సూచించినట్లు తెలుస్తుంది.

మరి పవన్ గౌరవానికి – జనసైనికుల ఆత్మాభిమానానికి… అధికారంలోకి రావాలనుకుని బలంగా భావిస్తున్న టీడీపీ నేతల ఆశలకి మధ్య వారదిగా నిలుస్తున్న ఈ పొత్తు.. ఎలా కొలిక్కి వస్తాది అన్నది వేచి చూడాలి. అదే జరగని పక్షంలో… ఎవరి దారి వారిదే! ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ కన్ ఫాం!!