టీడీపీతో పొత్తు కుదిరితే.! 50 ప్లస్ సీట్లలో జనసేన పోటీ.!

2024 ఎన్నికలకు సంబంధించి పొత్తు విషయమై తెలుగుదేశం పార్టీ స్పష్టంగానే వుంది. పొత్తు పెట్టుకోకుండా అధికారంలోకి రాలేమన్న ఆందోలనతో వుంది టీడీపీ. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై వీలైంత త్వరగా క్లారిటీ తెచ్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.

త్వరలో జనసేన అధినేత వద్దకు చంద్రబాబు నేతృత్వంలో ఓ బృందం వెళ్ళే అవకాశం వుందట. అది కూడా ఈ నెలాఖరులోపే జరిగిపోతుందని అంటున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలోనే ఈ పొత్తులపై క్లారిటీ వచ్చేస్తే, ఆ పాదయాత్ర మరింత ఉత్సాహంగా జరుగుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట.

‘పొత్తుల వ్యవహారం చంద్రబాబు తేల్చుతారు. మేం ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.? పొత్తు కుదిరితే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి.? అన్నది ముందు ముందు తేలుతుంది..’ అంటూ టీడీపీ నేతలు ఆయా చర్చా కార్యక్రమాల్లో అభిప్రాయపడుతున్నారు.

‘ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది కూడా పొత్తుల చర్చల తర్వాతనే ఓ స్పష్టత వస్తుంది’ అని ఓ టీడీపీ నేత, తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆఫ్ ది రికార్డుగా 50 సీట్లను జనసేనకు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నామని ఆ టీడీపీ నేత చెప్పారట.

‘అవసరమైతే ఇంకా ఎక్కువే ఇవ్వాల్సి రావొచ్చు.. పవర్ షేరింగ్ తప్పకపోవచ్చు’ అనే చర్చ టీడీపీలో కూడా జరుగుతోంది. ఉమ్మడిగానే వైఎస్ జగన్‌ని ఎదుర్కోవాలన్నది జనసేన కంటే బీజేపీ బలంగా ఆశిస్తున్న అంశమట.