ఏపీలో ఓట్ల జాతర జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా రసవత్తరంగా జరుగుతున్నాయి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు క్వార్టర్ మద్యం సీసానో.. 500 రూపాయలో ఇస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ఓటుకు రూ.40 వేల వరకు అందుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో డబ్బుల కట్టలు భారీగా చేతులు మారాయి. అక్కడ ఓటర్ల సంఖ్య వెయ్యి లోపే ఉంటుంది. కానీ అభ్యర్థులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటుకు నోట్లు కుమ్మరించారు. పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఓటుకు రూ.10వేల చొప్పున పంచారు. అంటే ఈ ఇద్దరు అభ్యర్థల నుంచి ఒక్క ఓటుకు రూ.20వేలు అందాయి. ఇక ఉప సర్పంచ్ రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో ఉన్నారు. వారు కూడా రూ.10 చొప్పున పంచారు. ఈ వార్డులో 110 మంది ఓటర్లు ఉంటారు. ఒక్కొక్కరికి రూ.10వేలు పంచారు. ఇలా డిప్యూటీ సర్పంచ్ అభ్యర్థల నుంచి కూడా ఓటుకు రూ.20వేలు అందాయి. మొత్తంగా ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు డిప్యూటీ సర్పంచ్ అభ్యర్థల నుంచి.. ఒక్క ఓటుకు రూ.40వేలు అందాయి. కాగా, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. ఫిబ్రవరి 9న రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 81.09 శాతం పోలింగ్ నమోదైంది.