ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు మింగుడుపడని నియోజకవర్గాల్లో రిజర్వుడు నియోజకవర్గాలు ఒకటి! అవి మొత్తం 36 ఉండగా… వాటిలో 29 ఎస్సీ, 7 ఎస్టీ స్థానాలు. గడచిన రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గాలు బాబుకు చేదుజ్ఞాపకాలనే మిగిల్చాయి. మరి ఈ నియోజకవర్గాలపై బాబు ఎలాంటి కాన్సంట్రేషన్ పెట్టబోతున్నారు.. ఎలాంటి శ్రద్ధ పెట్టినా జరిగేపనికాదని లైట్ తీసుకోబోతున్నారా.. ఇప్పుడు చూద్దాం!
2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసపెట్టి సైకిల్ ని పంక్చర్ చేసేస్తున్నాయి రిజర్వుడు నియోజకవర్గాలు. ఫలితంగా రెండుసార్లూ బాబుకు ఘోర అవమానం తప్పలేదు. 2014 లో మూడు నాలుగు సీట్లు వచ్చినా… 2019 అయితే మరీదారుణంగా ఏడిపించేసిన పరిస్థితి. అవును… 2019 ఎన్నికల్లో ఈ 36 నియోజకవర్గాల్లో… వైసీపీ 35 స్థానాల్లో గెలుచుకోగా, టీడీపీ కేవలం ఒకే ఒక్కసీటు గెలుచుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరపున డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రమే 2019లో గెలిచారు. ప్రత్యేకంగా ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే… వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసిన పరిస్థితి.
దీంతో… రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఈ స్థానాల్లో… మెజారిటీ నియోజకవర్గాలను గెలవాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రెడీ చేస్తున్నారంట. ఈ 36 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసి, వీటిలో కూడా బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారంట. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక భేటీలు నిర్వహించినా… గ్రిప్ మాత్రం దొరకడం లేదని… ఆ స్థానాల్లో మెజారిటీ ప్రజలు.. చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేస్తున్నారని చెబుతున్నారంట స్థానిక నేతలు! దీంతో… ఈ 36సీట్ల విషయంలో బాబు టెన్షన్ గా ఉన్నారని తెలుస్తుంది.
దీనికి తగ్గట్లు… ముస్లిం అభ్యర్థుల సీట్లు కూడా గంపగుత్తగా వైసీపీ గెలుచుకుంటుంది. కర్నూలు, గుంటూరు, కడప జిల్లాల్లో ముస్లిం నేతలు గెలిచిన అన్ని స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్న పరిస్థితి. దీంతో… జనరల్ స్థానాల సంగతి ఎలాగున్నా.. రిజర్వుడ్ సీట్లు మాత్రం చంద్రబాబును బాగా కలవరపెట్టేస్తున్నాయని కలవరపడుతున్నారంట తమ్ముళ్లు. మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి!
అయితే… బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు, అనుసరించిన విధానాలు, ట్రీట్ చేసిన పద్దతులే ఇందుకు కారణం అని… ఈ స్థానాల్లో సైకిల్ నడవడం ఆల్ మోస్ట్ కష్టమని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. అయితే.. ఈసారి మాత్రం గతంలో గెలిచిన ఒకటి కంటే ఎక్కువే గెలుస్తామని టీడీపీ నేతలు చెబుతుండటం గమనార్హం!