తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 32,681 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తెలంగాణ వస్తే ఒక దెబ్బకే లక్ష ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్… నాలుగున్నరేళ్లు పాలిస్తే ఆయన దెబ్బకు 32 వేల ఉద్యోగాలే రాలయని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. మాటల్లో ఉన్న చురుకుతనం కేసీఆర్ చేతల్లో లేదన్నారు.
టిఆర్ ఎస్ ప్రభుత్వం 2014 జూన్ 2 న ఏర్పడిందని అప్పటి నుంచి 2018 ఆగష్టు 31వరకు పోస్టుల విషయంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాల ద్వారా నివేదిక రూపొందించారు. అన్ని శాఖల్లో కలిపి 1,28,274 పోస్టుల ఖాళీలను గుర్తించారు. అందులో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాల ద్వారా ఉద్యోగాలు భర్తీ అయ్యింది మాత్రం 32 వేలని మంత్రి తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ నియామక మండలి, గురుకులాలు, ఆయా శాఖల ఎంపిక కమిటీల ద్వారా 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇలా నోటిఫికేషన్ జారీ చేసిన వాటిలో 24,746 పోస్టులు భర్తీ అయ్యినట్టు తెలిపారు.
2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో 128 పోస్టులను భర్తీ చేశారు. సింగరేణిలో 8205 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. వివిధ శాఖలలో రెగ్యూలర్ గా మార్చిన పోస్టులు 811 ఉన్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తన బండారాన్ని తానే బయటపెట్టుకుందని నిరుద్యోగులంతా ఆలోచించాలని నిరుద్యోగ నాయకులు పిలుపునిచ్చారు. అనేక పోస్టులను ఆదిలోనే తుంగలో తొక్కారని విమర్శించారు.
పోలీసు శాఖలో అధికంగా భర్తీ చేశారు తప్పా మిగతా వాటిలో చేయలేదన్నారు. డిగ్రీ అర్హతతో నింపిన జాబులు ఏవి కూడా లేవన్నారు. తక్కువ కాంపిటేషన్ ఉండే వాటిని ఫిల్ చేశారు కానీ మిగతా వాటిని విస్మరించారని నాయకులు ఎద్దేవా చేశారు. తక్షణమే లక్ష ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఖాళీలను వచ్చే ప్రభుత్వ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.