2024 ఎన్నికలు టీడీపీకీ, వైసీపీకీ అగ్ని పరీక్షే.!

అధికార వైసీపీకి వచ్చిన కష్టమేమీ లేదు.. 175 సీట్లలోనూ గెలిచేస్తామంటోంది. గతంలో 151 సీట్లు గెలిచేశాం కాబట్టి, ఈసారి అంతకన్నా ఎక్కువే వస్తాయన్నది వైసీపీ ధీమా. కాస్తంత ప్రభుత్వ వ్యతిరేకత వున్నా, అది పెద్దగా ప్రభావమేమీ చూపదని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.

సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నాం కాబట్టి, ప్రజలు తమకే ఓట్లేస్తారని కుండబద్దలుగొట్టేస్తున్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

వైఎస్ జగన్ చెబుతున్నదే నిజమైతే, గడప గడపకూ వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను జనం ఎందుకు తరిమికొడుతున్నట్లు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏ ప్రభుత్వం అయినా, నూటికి నూరు శాతం పని చెయ్యలేదు, చెయ్యదు కూడా. చేసేస్తే, ఎప్పుడో దేశంలోంచి పేదరికం మటుమాయమైపోయేదే.

ఎన్నికలొస్తున్నాయ్.. రాజకీయ పార్టీలు ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసేసుకుంటున్నాయ్. అధికార పార్టీ నుంచి సుమారు 60 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవకాశం కోల్పోనున్నారు.. పోటీ చేయడానికే సుమీ.! గెలవడం అన్నది ఆ తర్వాతి విషయం. టీడీపీకి ఆ ఇబ్బంది ఏమీ లేదు.. వున్నదే తక్కువమంది ఎమ్మెల్యేలు. సో, ఆశావహుల్లోంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం టీడీపీకి తేలిక. గెలుస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ.

ఇక, ఖర్చు విషయానికొస్తే.. ఇదే ఈసారి టీడీపీనీ, వైసీపీనీ నిండా ముంచేయనుంది. సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. సో,ఎన్నికల్లో ఓటు కొనేందుకు రాజకీయ పార్టీలు ఎంత ఇచ్చినా,అది తక్కువే అవుతుంది.

ఏడాదికోసారి వచ్చే సంక్షేమ పథకం తాలూకు లెక్క పది వేలకుపైనే వుంటుంది గనుక, ఒక్క ఓటుకి పాతిక వేలు ఆ పైన ఇచ్చినా తక్కువే..అని కొందరు ఓటర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారట.

అదీ నిజమే మరి.! సంక్షేమ పథకాలంటే ప్రభుత్వ ఖజానాకి చెందిన వ్యవహారాలు. ఎన్నికల్లో ఖర్చు చేసేది పార్టీల, అభ్యర్థుల సొంత ఖర్చు. సో, ఈసారి ఎన్నికలు మామూలుగా వుండవ్.!