ప్రస్తుతంలో ఏపీలో ఓ వైపు పంచాయతీ పోరు ఆసక్తిని రేకెత్తిస్తుంటే ..మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కాకరేపుతుంది. స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతుంది అంటూ వార్తలు రావడంతో దీని పై రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని నరేంద్ర మోదీలాంటి వ్యక్తి వచ్చి ప్రైవేటుపరం చేస్తాం, అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.
130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్ దని… ఆయనకు ప్రధాని మోదీ పెద్ద లెక్క కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉందని అమర్నాథ్ చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీకి జగన్ ఇప్పటికే లేఖ రాశారని గుర్తు చేశారు.
పోరాటాలు చేయడం జగన్ కు కొత్త కాదని అన్నారు. కేంద్రం మొండి వైఖరితో ముందుకు సాగితే… తిరగబడతామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.