విజయవాడ దుర్గ గుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్ !

విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుడిలో ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు చేసి, పలు కీలక పత్రాలను, అవినీతి సాక్ష్యాలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా, భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

13 Vijayawada Durga temple Employees Suspended - Sakshi

ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. సస్పెండ్ అయిన వారిలో ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా ఉండటం గమనార్హం.

ఈ మేరకు అన్నదానం, స్టోర్స్, హౌస్‌ కీపింగ్‌ విభాగపు సూపరింటెండెంట్లతో పాటు, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగపు సూపరింటెండెంట్, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే సూపరింటెండెంట్లను సస్పెండ్‌ చేస్తూ సురేష్‌బాబు చర్యలు తీసుకున్నారు. దర్శన టికెట్ల అమ్మకం కౌంటర్‌లో పనిచేసే ముగ్గురితో పాటు ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం, ఫొటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఈవో సస్పెండ్‌ చేశారు.