మహాకూటమిలో 11 మంది అభ్యర్థులకు అప్పుడే షాక్

మహాకూటమిలో సీట్ల కేటాయింపు అగ్గి రాజేసింది. కాంగ్రెస్ 65 మంది అభ్యర్దులతో తొలి జాబితా ప్రకటించడంతో స్వంత పార్టీలోని అసంతృప్తి నేతలంతా రెబల్స్ గా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. కూటమి పొత్తులో భాగంగా కొన్ని సీట్లను విపక్షాలకు కేటాయించడంతో స్వంత పార్టీ నేతలతో పాటు కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా స్వతంత్రంగా పోటి చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటి వరకు 11 మంది నేతలు స్వంతంగా బరిలోకి దిగుతామని ప్రకటించారు.

కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. బిసిలకు అన్యాయం జరిగిందంటూ బిసి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిసిలకు అన్యాయం జరిగిందని దానిని నిరసిస్తూ 17 వ తేదిన తెలంగాణ బంద్ కు బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. అనేక పార్టీల నేతలు ఆందోళనలు చేసినప్పటికి కూడా అవేమి పట్టించుకోకుండా పార్టీలు ఇష్టానుసారంగా టికెట్లు కేటాయించారని వారు మండిపడ్డారు. గెలిచే అభ్యర్ధులకు కాకుండా ఇతరులకు కేటాయించారని వారు నిరసన తెలిపారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకు టికెట్ కేటాయించాలని పోరాడిన భిక్షపతి యాదవ్ కు నిరాశే ఎదురైంది. అక్కడ టిడిపికి చెందిన భవ్య ఆనంద ప్రసాద్ కు టికెటిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరో సారి ఆలోచన చేయాలని లేని పక్షంలో స్వంతంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. కోదాడ నుంచి టిడిపి తరపును టికెట్ ఆశించిన బలమైన నేత బొల్లం మల్లయ్య యాదవ్. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతున్నారు. దీంతో తాను స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతానని మల్లయ్య యాదవ్ ప్రకటించారు.

వీరితో పాటు మరో 9 మంది నేతలు కూడా తాము కూటమికి రెబల్స్ గా పోటి చేస్తామని ప్రకటించారు. మొదటి జాబితా చూసి వీరు ప్రకటన చేశారు. రెండు, మూడో జాబితా విడుదలయ్యేలోపు మరికొంత మంది నేతలు రెబల్స్ గా పోటి చేస్తారని తెలుస్తోంది. కూటమికి వ్యతిరేకంగా 40 మంది అభ్యర్దులు పోటి చేస్తారని సమాచారం. స్వంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకతలు రావడంతో పార్టీల పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. రసవత్తరంగా సాగుతున్న రాజకీయం ఎటు తిరుగుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

కూటమికి రెబల్స్ గా పోటి చేయనున్న 11 మంది సభ్యులు వీరే…

  1. వరంగల్ వెస్ట్- నాయిని రాజేందర్ రెడ్డి

  2. స్టేషన్ ఘన్ పూర్- విజయ రామారావు

  3. జనగాం – రాజిరెడ్డి

  4. కంటోన్మెంట్- క్రిశాంక్

  5. శేరిలింగంపల్లి- భిక్షపతి యాదవ్

  6. దుబ్బాక- ముత్యం శ్రీనివాస రెడ్డి

  7. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్

  8. మంచిర్యాల- అరవింద్ రెడ్డి

  9. జడ్చర్ల- అనిరుధ్ రెడ్డి

  10. బాన్సువాడ- మాల్యాది రెడ్డి

  11. ఆలేరు- రాంచందర్ రెడ్డి   

 

రెబల్స్ గా పోటి చేయనున్నట్టు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో ఎవరెవరు ఉన్నారంటే 

చెన్నూర్- దుర్గం భాస్కర్

ముధోల్- నారాయణరావు

సూర్యాపేట-  పటేల్ రమేష్ రెడ్డి

నకిరేకల్- ప్రసన్నరాజ్

పెద్దపల్లి- ఈర్ల కొమురయ్య, బల్మూరి వెంకట్

 కరీంనగర్-నేరేళ్ల శారద

 మానకోండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ

 వికారాబాద్- చంద్రశేఖర్

తాండూరు- రాకేష్

 అచ్చంపేట్- చారుకొండ వెంకటేశ్

 మునుగోడు-పాల్వాయి స్రవంతి

 ములుగు- పోడెం వీరయ్య (భద్రాచలం టికెట్‌ కేటాయించడంపై కేడర్‌లో అసంతృప్తి)

 ఆదిలాబాద్- భార్గవ్ దేశ్ పాండే