సాక్షి తగ్గించి రాస్తే ఈనాడు పెంచి రాసింది !

గురువారం రోజు విశాఖలో గ్యాస్ లీకేజీ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ప్రభుత్వ విభాగాలు అన్నీ  సమర్థవంతంగా, సకాలంలో స్పందించడంతో విశాఖలో పెను ప్రమాదమే తప్పింది.

ఉదయం టీవీలో విజువల్స్ చూసిన వారందరికీ సాయంత్రానికి ఎటువంటి వార్తలు వినాల్సి వస్తుందో అని కంగారుపడ్డారు. అయితే  అధికార యంత్రాంగం ఉదయం తొమ్మిది గంటలకే  పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. మధ్యాహ్నం విశాఖ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  బాధితులను పరామర్శించి గతంలో ఎన్నడూ లేని రీతిలో నష్టపరిహారం ప్రకటించడంతో కొంత ఉపశమనం లభించింది.

అయితే ఈ సంఘటన మీద రాష్ట్రంలో ఉన్న పత్రికలు ఎలా స్పందించాయో  చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు జగన్మోహన రెడ్డిని విమర్శించే ఆంధ్రజ్యోతి, ఈనాడు  ఎటువంటి నెగటివ్  వార్తలు రాయలేదు. కేవలం దుర్ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితిని రాశారు తప్ప ఇదేదో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అనో లేకపోతే అధికారుల అలసత్వం వల్లే ఇలా జరిగిందనో  లేదా ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం అనో చెప్పకుండా కేవలం ఘటన వివరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇది మంచి పరిణామంగానే భావించాలి.

మరోవైపు నేషనల్ మీడియాలో రాష్ట్ర అధికార యంత్రాంగం బాగా పని చేసిందని వారు సకాలంలో స్పందించడం వలన పెను ప్రమాదం తప్పిందని కొనియాడారు.  జాతీయ పత్రికలు మోడీ అమిత్ షా పరిస్థితిని సమీక్షించారని ఒక జాతీయ దృక్పధంతో కథనాలని రాశారు.

అయితే మృతుల సంఖ్యకు సంబంధించిన మాత్రం   రాష్ట్రంలోని మూడు ప్రధాన పత్రికలు  వేరు వేరు సంఖ్య ప్రచురించారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారని జాతీయ పత్రికలో ప్రచురితమైంది.  అయితే  సాక్షి దినపత్రిక ఈ సంఖ్యను కొంచెం తగ్గించి పది మంది చనిపోయారని రాయగా ఈనాడు పత్రిక పన్నెండు మంది చనిపోయారని రాసింది.  ఆశ్చర్యంగా ఆంధ్రజ్యోతి జాతీయ పత్రికల్లో చెప్పినట్టు పదకొండు మంది చనిపోయారని ప్రచురించింది.