వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.. అది బాబును ఉద్దేశించి అన్నారా..? లేక కేసీఆర్‌ను ఉద్దేశించి చేశారా అన్నది అర్థం కావడం లేదు.
కరోనాకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న చర్యలకు సంబంధించి విజయ సాయి రెడ్డి ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో జగన్ మీడియా సమావేశాల నిర్వహణపై పలు విమర్శలు తలెత్తుతుండటం, జగన్ సరిగా సమాధానాలు చెప్పక దాటవేస్తున్నారు అన్న వాదనలకు రిప్లే ఇవ్వాలనుకున్నారేమో.. జగన్ చేతల మనిషి అని ప్రచారానికి ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటారని ట్వీట్ చేశారు. అయితే ఇది ఏ ఉద్దేశ్యంతో చేశారో గానీ.. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కేసీఆర్‌కు కూడా తగిలేలా ఉన్నాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మీడియా మేనేజ్‌మెంట్‌లో ఆయన ఎప్పుడూ ముందుండే వారు. ఇక విపత్తుల సమయంలో గంట గంటకూ సమీక్షలు నిర్వహించి దానిని మీడియాకు తెలిసేలా చేసేవారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమీక్షలు నిర్వహించి విషయాలను ప్రజలకు తెలియాలి అంటున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కాస్త వెనుకబడ్డట్లే కనిపిస్తోంది. జగన్ మీడియా ముందుకు రావడం కాస్త అరుదుగానే కనిపిస్తుంది. కాబట్టే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇలా ఆయన చేతల మనిషి అని చెప్పినట్లు ఉన్నారు.
నరేంద్రమోడీ తతిమ్మా అన్ని కార్యకలాపాలను పక్కన పెట్టినట్టుగా… పూర్తి స్థాయిలో కరోనా మీదనే పనిచేస్తున్నారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల వారితో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరాటం ఎలా సాగాలో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అలాగే రోగులతోను, డాక్టర్లతోను కూడా మాట్లాడుతున్నారు. అతి తరచుగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా విషయాలపై ప్రజలకు అప్ డేట్ లు తెలియజెబుతున్నారు. కేసీఆర్ కూడా ప్రతి రెండు రోజులకు ఒకసారి అధికార్లతో సమీక్ష, ప్రెస్ మీట్ పెడుతున్నారు.