విశాఖ పట్నం అరెస్టులతో ఎవరి పరువు పోయింది?

చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతి ఇచ్చీ భద్రత కల్పించ లేక పోయినందుకు
పోలీసు అధికారులు హైకోర్టులో చీవాట్లు తింటే నేతలు మాటలు విని వీరంగం చేసినందుకు వైసిపి కార్యకర్తలు అరెస్టు కావలసి వచ్చింది. మంత్రులు స్వచన విఘాతాలకు పాల్పడి నవ్వుల పాలు కావలసి వచ్చింది. రెండు రోజులు విరామం తర్వాత ఎట్టకేలకు విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్టులకు తలపడ్డారు.మొన్న గురువారం విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అడ్డగించినందుకు సిసి ఫుట్టేజి ప్రకారం పలువురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందులో 37 మందికి పైగా వైసిపి నాయకులు వున్నారు. వీరితో పాటు 11 మంది టిడిపి నేతలను అరెస్టు చేశారు. టిడిపికి చెందిన వారు చంద్రబాబు నాయుడును అడ్డగించినందుకు కాకుండా ఇతర కారణాలు చూపెట్టి అరెస్టు చేసి వుంటారు. ప్రజాసంఘాల నేతగా చెప్పుకొనే జెటి రామారావు పెద్ద హంగామా సృష్టించారు.
ఇతనితో పాటు వైసిపికి చెందిన మహిళా నేత కృపాజ్యోతిని మహిళ ఎసైపై దాడి చేసినందుకు అరెస్టు చేశారు.

ఈ అరెస్టులతో వైసిపి మంత్రుల పరువు పోయింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడు అడ్ఢగించడంలో వైసిపికి సంబంధం లేదని మంత్రి శ్రీనివాసరావు బల్లగుద్ది ప్రకటన చేశారు. విశాఖ ప్రజలే ఆయన్ను అడ్డుకున్నారని చెప్పారు. మంత్రి ప్రకటనతో మరో అపవాదు తలెత్తింది. విశాఖ ప్రజలు కోడి గుడ్లు చెప్పులు వేసే వారుగా పరోక్షంగా మంత్రి చిత్రించారనే ఆరోపణలు కొందరు వ్యక్తపర్చారు.  తన పార్టీ వారిని కాపాడు కొనేందుకు మంత్రి ఇందుకు తల పడ్డారు. కాని సిసి ఫుట్టేజీలు వాస్తవాలు చెప్పడం పైగా హైకోర్టు పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టడంతో పోలీసు అధికారులు తమను కాపాడుకొనేందుకు వైసిపి నేతలను అరెస్టు చేయక తప్పింది కాదు.ఇదంతా ఎట్లుందంటే అడుసు తొక్కి కాళ్లు కడుగుకొనేందుకు తంటాలు పడినట్లుంది.

కారణం ఏదైనా రాష్ట్ర హోం మంత్రి కూడా స్థానిక ప్రజలు ఆగ్రహించి చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టనీయలేదని చెప్పారు. తన శాఖకు చెందిన అధికారులే సిసి ఫుట్టేజి ప్రకారం తన పార్టీ వారిని అరెస్టు చేయడంతో ఎటూ మాట్లాడలేని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తమ పార్టీ వారికి సంబంధం లేదని వెనకేసుకొచ్చారు. ఈ అరెస్టుల తర్వాత టిడిపి నేతలు చేయబోయే విమర్శలకు సమాధానం చెప్పేందుకు మంత్రులు ఇతర కారణాలు వెతుక్కోవలసి వుంటుంది.
అంతేకాదు. పోలీసు అధికారులు కూడా హైకోర్టుకు జవాబు చెప్పుకోవఢంలో ఇబ్బందులు పడవలసి వుంటుంది. అంతేకాదు కొంత మంది వైసిపి ముఖ్య నాయకులు పోలీసులు అధికారులను బెదిరించే దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ ఎపిసోడ్ ఎందుకో ఎక్కడో మొదలైంది. తుదకు పోలీసులు టార్గెట్ అయ్యారు. వారితో పాటు వైసిపి నేతల మాటలు విని వీరంగం చేసి ద్వితీయ తృతీయ శ్రేణి వైసిపి నేతలు ఊచలు లెక్కబెట్ట వలసి వస్తోంది.