గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచినప్పటికీ విశాఖలో నలుమూలలా టీడీపీ గెలిచింది. విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు ఏంటో చెప్పకనే చెబుతోంది. అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. ఇంకా చేస్తుంది కూడా.
విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ప్రాంతంలో బలంగా ఉంది. ఆ పార్టీకి అక్కడ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. అటువంటి విశాఖపట్నంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎలా? ఏమి చెయ్యాలో? అని అని పార్టీ నేతలు మదనపడిపోతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అక్కడ కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తుంది. ఉన్న నేతలలో ఎక్కువ మంది పార్టీని వీడిపోవడంతో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి చేరువయ్యారు. రూరల్ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రహమాన్ సయితం ఫ్యాన్ పార్టీ నీడన చేరిపోయారు. ఇక తెలుగుదేశం ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబులు కూడా పార్టీలో ఉన్నా లేనట్లే కన్పిస్తున్నారు. దీంతో జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటన్నది అయోమయంగా తయారైంది.
బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ ఉన్న చోట పట్టును కోల్పోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో చంద్రబాబు విశాఖ పర్యటనకు వస్తారని చెబుతున్నారు. ఆయన విశాఖ పర్యటనకు వచ్చేలోపు నగరంలో తెలుగుదేశం పార్టీకి కొత్త నాయకత్వాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి వంటి నేతలకు అప్పగించారు. అన్నీ ఉన్న వారిని ఎంపిక చేసి జీవీఎంసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం జెండా ఎగుర వేసి, వైజాగ్ ని రాజధాని గా చేసుకుని రాష్ట్రాన్ని పరిపాలిద్దాం అనుకుంటూ ఉన్న వైసీపీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చెయ్యాలని పార్టీ నేతలకు చంద్ర బాబు దిశా నిర్దేశం చేశారట.