వాటాల గురించి చంద్రబాబు మాట్లాడటమా

’వైసిపి అవినీతి సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి వాటాలు వేసి పంచుతున్నారు’…ఇది తాజాగా చేసిన తాజా చీప్ కామెంట్. పార్టీలో అంతర్గత సమస్యలను జగన్మోహన్ రెడ్డి పరిష్కరించుకోవటం కూడా చంద్రబాబుకు తప్పుగా కనిపిస్తోంది.  పైగా జగన్ మధ్యవర్తిగా ఉండి ఎంఎల్ఏల మధ్య ఇసుక పంచాయితీలను చేస్తున్నారంటూ మండిపడటమే విచిత్రంగా ఉంది.

ఇప్పటి వరకూ ఎంఎల్ఏల మధ్య ఇసుక కానీ ఇతరత్రా వ్యవహారాల్లో కానీ ఆర్ధిక విషయాలపై జగన్ పంచాయితీలు చేసినట్లు ఎక్కడా వినబడలేదు. ఇపుడు ఇద్దరు ఎంఎల్ఏల మధ్య మొదలైన పంచాయితీ కూడా ఇసుక వ్యవహారంపై కాదు. నెల్లూరు జిల్లాలో ఆధిపత్య గొడవలతోనే పంచాయితి మొదలైంది.

ఎంఎల్ఏల మధ్య వివాదం బయటపడగానే వెంటనే జగన్ పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలకు అప్పగించి పంచాయితీ చేయించారు. దాన్ని కూడా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఎంపిడివో అర్ధరాత్రి న్యాయం కోసం ఆందోళన చేయటమేంటని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. పైగా ఇటువంటి ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ? అన పార్టీ నేతలను అడగటమే ఆశ్చర్యంగా ఉంది.

చింతమనేని ప్రభాకర్-వనజాక్షి, రవాణా శాఖ కమీషన్ బాలసుబ్రమణ్యం-బొండా ఉమా, కేశినేని నానిల వివాదాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. చంద్రబాబు హయాంలో అరాచకాలు జరిగాయి కాబట్టే మొన్నటి ఎన్నికల్లో జనాలు గూబగుయ్యిమనిపించారు. అయినా చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్లు లేదు. మొత్తానికి చంద్రబాబు వ్యవహారమంతా గురివింద గింజ సామెతలాగే తయారైంది.