వంగవీటి పరిస్ధితి దారుణంగా తయారైందా ?

వంగవీటి రాధాకృష్ణ పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. ఏ రోజు ఏ పార్టీలో చేరుతారో తెలీని పరిస్ధితిలో పడిపోయారు. ప్రస్తుతం రాధా ఏ పార్టీలో ఉన్నారని అడిగితే చాలా మంది  కచ్చితంగా చెప్పలేరనే చెప్పాలి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని సిఎం అవనిచ్చేది లేదని భీకర ప్రకటనలు చేసిన విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుండి రాధా ఉనికే ఎక్కడా కనబడటం లేదు. జగన్ మీద కోపంతో అప్పట్లో టిడిపిలో చేరిన రాధా ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో తెలీదు. ఎందుకంటే తెలుగుదేశంపార్టీ యాక్టివిటీస్ లో కూడా ఎక్కడా కనబడటం లేదు.  తాను కోరుకున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వనందుకు జగన్ పై కోపంతో టిడిపిలో చేరారు. పోని టిడిపిలో చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చారా అంటే అదీ లేదు.

ఈ నేపధ్యంలోనే రాధా జనసేనలో చేరుతారని ఒకసారి లేదు టిడిపిలోనే కంటిన్యు అవుతారంటూ మరోసారి ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాధా భేటి అయ్యారు. అంతుకుముందే పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ తో కూడా భేటి జరిగింది. ఇంకేముంది ఈరోజో రేపో రాధా జనసేనలో చేరిపోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

నిజానికి ఇప్పటి పరిస్ధితుల్లో రాధా ఏ పార్టీలో ఉన్నా ఒకటే. పార్టీపై  భవిష్యత్తు లేదనే టిడిపి నేతలు బయటకు వచ్చేస్తున్నారు. ఇక జనసేనలో పవన్ కే భవిష్యత్తు లేదని అర్ధమైపోతోంది. వైసిపిలో చేర్చుకునేది అనుమానమే. ఆమధ్య బిజెపిలో చేరబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కాబట్టి వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా ఒకటే అన్నట్లుగా తయారైంది పరిస్ధితి. చూస్తుంతే తన భవిష్యత్తును తానే రాధా చెడగొట్టుకున్నట్లున్నారు.