లాక్‌డౌన్ వల్ల ఉపయోగం లేదంటోన్న వైకాపా ఎంపీ

కోవిడ్-19 పాజిటివ్ కేసుల విషయంలో కర్నూలు జిల్లా దేశంలోనే ముందు వరసలో నిలవగా జిల్లాకు సంబంధించి తాజాగా మరో ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేపుతున్నాయి.

పాజిటివ్ కేసులకు సంబంధించి తమ.. ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఎంపీ సంజీవ్ కుమార్ స్వయంగా తెలిపారు. తమ ఇద్దరు సోదరులు, వారి భార్యలు, 14 ఏళ్ల బాబుకి, తమ తండ్రికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఎంపీ తెలిపారు. ప్రస్తుతం వారిలో తండ్రి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో హైదరాబాద్‌లోకి ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.

వైరస్ సోకిన ఆరుగురిలో నలుగురు డాక్టర్లు కావడం గమనార్హం. వీరంతా ఇప్పుడు ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కేసుల నిర్థారణ గురించి తెలిపిన ఎంపీ మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లాక్‌డౌన్ అంతగా ఉపయోగపడటం లేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఎంపీ స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. లాక్ డౌన్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఏంటి అన్నది తెలియాలి.