రాష్ట్ర గవర్నర్ కోర్టు లో బంతి. ఏం చేస్తారో సస్పెన్స్?

రాష్ట్ర శాసన మండలి చైర్మన్ షరీఫ్ మంగళవారం గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారు. వాస్తవంలో శాసన సభ స్పీకర్ శాసన మండలి చైర్మన్ రూలింగులను సభ్యులు కూడా ప్రశ్నించే అధికారం లేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకోవు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. మండలి చైర్మన్ తన విచక్షణాధికారం వినియోగించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీలకు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలోనే అధికార ప్రతి పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చైర్మన్ నిర్ణయాన్ని అధికార పక్షం తప్పు పట్టింది.

ఈ పరిస్థితుల్లో సెలక్ట్ కమిటీ ఏర్పాటు గురించి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను శాసన మండలి కార్యదర్శి రెండు మార్లు తిరస్కరించారు. ఈ ప్రతిష్టంభన బిల్లులు ఆమోదం పొందకుండా ప్రభుత్వానికి, సెలక్ట్ కమిటీ ఏర్పాటు జరగకుండా ప్రతి పక్షాలకు సవాల్ గా మిగిలింది. మరో వేపు తనకు తిరుగు లేని అధికారాలున్నా అధికారులు తన ఆదేశాలను ధిక్కరించడంపై మండలి చైర్మన్ కు అవమానం ఆగ్రహం రెండూ మిగిలాయి. రెండు మూడు రోజుల విరామం అనంతరం మండలి చైర్మన్ షరీఫ్ గవర్నర్ హరి చందన్ ను కలసి శాసన మండలి కార్యదర్శి సహాయ కార్యదర్శులపై ఫిర్యాదు చేశారు. వారిపై చర్య తీసుకోవాలని కోరారు.

ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టుకు చేరింది. తిరుగులేని అధికారాలు వున్న చట్ట సభ చైర్మన్ ఆదేశాలు ధిక్కరించినందుకు గవర్నర్ అధికారులపై చర్య తీసుకుంటారా? లేక తన ప్రభుత్వం గైకొన్న వైఖరి తప్పుగాని ఒప్పుగాని దాని పంతం కాపాడుతారా? బహుశా భారత దేశంలో ఇటువంటి విచిత్ర పరిస్థితి ఏర్పడలేదు. అందరికీ సంకట స్థితే.