రాష్ట్రానికి నాలుగు రాజధానులా ?

బిజెపి నేత టిజి వెంకటేష్ సంచలనం రేపారు. రాష్ట్రానికి నాలుగు రాజధానులను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన విషమం ఇపుడు సంచలనంగా మారింది. అసలు రాజధాని నిర్మాణంపై వారం రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లతో మంటలు మండుతున్న విషయం తెలిసిందే. ఆ మంటలు చల్లారకుండానే టిజి మరింత ఆజ్యం పోశారు.

జగన్ కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు రాజధానులను ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరంలో, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి కాకినాడలో, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి గుంటూరులోను, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. నాలుగు రాజధానుల ఏర్పాటును జగన్ తన మొదటి ఢిల్లీ పర్యటనలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడితో చర్చించినట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

నాలుగు రాజధాని ప్రాంతాల్లోను నాలుగు అసెంబ్లీ భవనాలను కట్టటానికి జగన్ నిర్ణయించుకున్నారట. కాబట్టి జగన్ ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని కూడా టిజి చెప్పారు. ఇక్కడ ఇంకో విచిత్రమేమిటంటే జగన్ ప్రధానితో చెప్పినంత మాత్రాన కేంద్రం ఆమోదం ఉంటుందని అనుకోవటం పొరపాటే అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

నిజానికి రాజధాని మార్పుకు సంబంధించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ విషయమై బొత్స తన అభిప్రాయాన్ని చెప్పగానే టిడిపి, బిజెపి నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. రైతులతో గగ్గోలు పెట్టిస్తున్నారు. రాజధానిని ఇక్కడ నుండి తరలిస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. అలాంటిది ఇపుడు టిజి వెంకటేష్ చేసిన కామెంట్లపై మాత్రం నేతలెవరూ మాట్లాడటం లేదు.