రాధాకృష్ణ – ఎవరికన్నా చెప్పేందుకే నీతులు

రాధాకృష్ణ - ఎవరికన్నా చెప్పేందుకే నీతులు
ఆంధ్ర జ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ ప్రపంచానికి నీతులు వల్లిస్తుంటాడు. ఎవరు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అసలు ఎందుకు చేయాలో ఆయనే నిర్ణయిస్తుంటాడు. అప్పుడప్పుడు రెండుమూడు అడుగులు ముందుకేసి సమాజానికి నీతి సూత్రాలు అందిస్తుంటాడు. 
 
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతి ఆదివారం “కొత్త పలుకు” పేరుతో ఆధ్యాత్మిక సందేశాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా మొన్నటి ఆదివారం సందేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ 3 మాస్కులు ఇస్తానన్న నిర్ణయాన్ని తప్పు పట్టి ఒకప్పుడు హైదరాబాద్ నిజాం కరువు వచ్చిన సందర్భంలో ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం హుస్సేన్ సాగర్ తవ్వించాడని, ఇప్పటి ప్రభుత్వాలు కూడా ఇలా ప్రజాహితమైన కార్యక్రమాలు తీసుకోవాలె కానీ మాస్కులు పంచడం వంటి వృధా పనులు చేయకూడదని అనుచిత బోధ చేశారు. 
 
మరో సందర్భంలో “అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది” అనే సామెతను వాడుకొని ప్రపంచానికి ఆధ్యాత్మిక మరియు విజ్ఞాన సందేశం ఇచ్చేశారు. పనిలో పనిగా ఒక స్వామిజి చర్యలను కూడా హేళన చేసే ప్రయత్నం చేశారు. మత విశ్వాసాలను ఇలా హేళన చేయకూడదనే ఇంగితం ఉండాలికదా! 
 
సరే ఇంత చేసిన మహానుభావుడు, ఇన్ని నీతులు చెప్పే జ్ఞాన పురుషుడు ఇప్పుడు కుడితిలో పడ్డట్టు, గడ్డి తిన్నట్టు కనిపిస్తోంది. తన వద్ద ఆంధ్ర జ్యోతి లో పనిచేస్తున్న డజన్ల కొద్దీ జర్నలిస్టులకు కరోనా కంటే బలమైన దెబ్బ కొట్టాడు. ఇప్పటికే కరోనా సాకుతో పత్రికలో పేజీలు తగ్గించి నాలుగు రూపాయలు పొదుపు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా జర్నలిస్టుల నెత్తిన శఠగోపం పెట్టి ప్రపంచ మీడియాకు ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. 
 
కరోనా కారణంగా తన ఆదాయం పడిపోయిందనే సాకుతో షుమారు 30 మంది జర్నలిస్టుల జీతాల్లో భారీ కోత విధించాడు రాధాకృష్ణ. ఏకంగా పదివేల నుండి 20 వేల వరకూ ప్రతి జర్నలిస్టు జీతంలో నుండి కోత పెట్టాడు. ఇప్పటికే ఇటు పత్రికలోనూ, అటు టీవీ లోను కొందరు జర్నలిస్టులను ఉద్యోగం నుండి తీసేశాడు. లాక్ డౌన్ సాకుతో వారందరిని ఇంటిదగ్గరే ఉండమని మార్చి నెలలో చెప్పి వారికి జీతాలు ఎగ్గొట్టాడు. ఇప్పుడు తాజాగా ఇంకొందరి జీతాల్లో కోత విధించాడు. 
 
 రాధాకృష్ణ మాత్రమే కాదు మీడియా పెద్దగా చలామణి అవుతున్న రామోజీ రావు కూడా ఇప్పటికే జర్నలిస్టులను భారీగా ఇంటికి పంపించి తన వంతు పాపం మూటగట్టుకున్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే ఇలాంటి వాళ్ళు తమవంతు వచ్చేసరికి చేసేది ద్రోహం, అన్యాయం అని మరోసారి నిరూపించుకున్నారు.