వారాహియాత్ర రెండో దశ మొదటి సభ ఏలూరులో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో మైకందుకున్న పవన్… వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్ల వల్లే ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా పేర్ని నాని ఎంటరయ్యారు.
అవును… ఏపీ వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పూర్తి సృహలో ఉండి మాట్లాడారా అని కొంతమంది అంటుంటే… విజ్ఞత మరిచి మాట్లాడారని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలో మైకందుకున్న పేర్ని నాని… పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా పవన్ సభలో ముందుగా… ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉంది ఆ విషయం ఎన్.సి.బి. రిపోర్ట్ లో కూడా ఉందని అన్నారు. అయితే ఇది మిడి మిడి జ్ఞానం.. హాల్ నాలెజ్డ్ తో చేసిన వ్యాఖ్యలు అని అంటున్నారు విశ్లేషకులు. కారణం… దేశంలో ఎన్.సి.ఆర్.బి. (నేషనల్ క్రైం రిపోర్ట్ బ్యూరో) ఉంది తప్ప పవన్ చెప్పిన సంస్థ లేదు!
ఇదే విషయాన్ని ఎత్తుకున్న నాని… పవన్ చెప్పిన ఎన్.సి.బి. రిపోర్ట్ అయితే అలానే చెబుతుందని.. పవన్ చెప్పిన ఎన్.సి.బి. అంటే… నారా చంద్ర బాబు అని ఎద్దేవా చేశారు. తాను చదివిన రెండు లక్షల పుస్తాకాల లాగానే ఈ లెక్కలు కూడా హంబక్కే అన్నట్లుగా పేర్ని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
“మీకు తప్పుడు లెక్కలిస్తున్న రామోజీ, రాధాకృష్ణను అడగండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతీ పథకాన్నీ పేదలకు వాలంటీర్లు అందిస్తున్నారు. మనిషి జన్మనెత్తినవాడెవడూ ఇలా మాట్లాడడు. రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా? చంద్రబాబు మెప్పు కోసం వాలంటీర్లపై పవన్ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కు విజ్ఞత ఉంటే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి” అని పేర్ని నాని ఫైరయ్యారు.
ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్ కు భయం పట్టుకుందని చెప్పిన పేర్ని నాని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారని.. ఫలితంగా అబద్దాలు చెప్పను అంటూ పవన్ అవాస్తవాలే మాట్లాడుతున్నాడని నాని నిప్పులు చేరిగారు.
ఈ సందర్భంగా జగన్ ను ఏకవచనంతోనే పిలుస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. సీఎం జగన్ ను ఏకవచనంతో పిలిస్తే తాము కూడా అదే రీతిలో పవన్ కి సమాధానం చెబుతామన్నారు పేర్ని నాని. పవన్ కు మాత్రమే నోరుందా.. పవన్ కుమాత్రమే నాలుక ఉందా.. అని ప్రశ్నించిన ఆయన… వైసీపీ జెండా మోసే ప్రతి ఒక్కరికీ నాలుక, నోరు ఉన్నాయని పవన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్, చంద్రబాబు కాళ్లు మొక్కినా తమకేమీ ఇబ్బంది లేదని నాని సూచించారు.