రాజధాని రైతులకి అన్యాయం చేసింది ఎవరు?

అమరావతి నుండి ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని మరియు జ్యూడిషల్ విభాగాన్ని వెనుకబడిన ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకి తరలిస్తే తప్పు ఏమిటి అని ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ఒక ప్రశ్న వేసినప్పుడే అమరావతి కేవలం లెజిస్లేటివ్ కాపిటల్ గా పరిమితమైంది.

ఈ నెల రోజులు గవర్నమెంట్ చేసిందత ఒక ఫార్స్. కమిటీలని నివేదికలని కొంత సమయం తీసుకోవడానికి కారణం వారు ముందు తీసుకున్న నిర్ణయాలకు ఒక శాస్త్రీయత కల్పించడం కోసమే. ఈ ప్రభుత్వం కోరుకునట్టు కాకుండా వేరే విధంగా నివేదిక ఇస్తారా…. ఒక వేళా ఇచ్చినా ప్రభుత్వ నిర్ణయం మారేదా?

అలాగే ఈ నిర్ణయం వెలువడినప్పటినుండి ప్రతిపక్ష తెలుగుదేశం తన నిరసన వ్యక్తం చెయ్యడం చూసాము. తనలోని ఒక కొత్త కోణాన్ని ఈ తరం ఓటర్లకి జోలిపట్టి మరీ చూపించారు చంద్ర బాబు. ఐతే గమ్మతేంటంటే రాజధానిని ఖచ్చితంగా మారుస్తారని తెలిసి కూడా తనకు ఎదురైనా అసెంబ్లీ ఎన్నికల పరాభవం తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడే ఒక సాధనంగా వాడుకున్నారనిపిస్తుందే తప్ప రైతుల ప్రయోజనాలని కాపాడాలనే ఒక చిత్తశుద్ధి మచ్చుకైనా కనిపించదు.

పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ ప్రభుత్వం ఏమిచేస్తుందో తెలిసికూడా కేవలం తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇవ్వడం శోచనీయం.

పాలకులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కుతగ్గరు. మనది ప్రజాస్వామ్యమే అయినా మన పాలకులు నియంతలు. పార్టీ ఏదైనా, నేత ఎవరైనా పాలన ప్రజాస్వామ్యబద్దంగా ఉండదు. నాయకులు వారి అవసరార్ధం పార్టీలు మారతారు. పార్టీలు వాటి అవసరార్ధం నిర్ణయాలు మార్చుకుంటాయి. ఈ లాజిక్ మిస్సయితే అన్నీ మిస్సవుతాం. చాలా కోల్పోతాం.

సమైక్యాంధ్ర ఉద్యమంలో తప్పు జరిగింది. లాజిక్ మిస్సయ్యాం. రాష్ట్రం విడిపోతే మనకు ఏం కావాలో అడగలేదు. అడిగేవారిని అడగనివ్వలేదు. చెప్పేవారిని చెప్పనివ్వలేదు. విభజన ఒప్పుకోం అన్నాం. సమైక్యమే ముద్దు అన్నాం. విభజన జరగదు, అలాంటి ఆస్కారమే లేదు అన్నవారిని నమ్మాం. విభజనచట్టం ప్రతులు చించి పారేస్తున్నాం అంటే నమ్మాం. బ్రహ్మాస్త్రం ఉంది అంటే నమ్మాం. రాజ్యాంగం ఉందంటే నమ్మాం. సుప్రీం కోర్టు ఉందంటే నమ్మాం. రోడ్డెక్కి గోలచేశాం.

ఏం కోల్పోతున్నామో చూసుకోలేదు. చాలా కోల్పోయాం. ఇప్పుడు మూడు రాజధానులు అంటుంటే మళ్ళీ అలాగే చేస్తున్నాం. రిపోర్టులు భోగిమంటల్లో వేశాం. కోర్టువరకూ వెళ్తున్నాం. అమరావతే ముద్దు అంటున్నాం. ఏం కోల్పోతామో చూడడం లేదు. ఏం కావాలో అడగడం లేదు.

అధికారపక్షం నిర్ణయం మార్చదు. ప్రతిపక్షం పోరాటం ఆపదు. బలయ్యేది ప్రజలు, ప్రాంతాలే. న్యాయం కావాలి అని అడక్కపోతే అమరావతికి దక్కేది సమైక్యాంధ్ర ఫలితమే.

ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ పరిస్థితికి ఎవరు కారణం అని?