రాజధాని నిర్మాణంపై బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. రాజధానిని అమరావతి ప్రాంతం నుండి మార్చేందుకు వీల్లేదంటూ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర హెచ్చిరికలు చేస్తున్నారు. తాజా బిజెపి ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగటం స్ధానికులకే ఇష్టం లేదని పెద్ద బాంబు పేల్చారు.
టిజి తాజా వ్యాఖ్యలతో బిజెపి నేతలే ఉలిక్కిపడ్డారు ముందు. కన్నా హెచ్చరికలేమో చంద్రబాబునాయుడుకు మద్దతు పలికేలా ఉన్నాయి. అదే సమయంలో టిజి వ్యాఖ్యలేమో కన్నా ఆలోచనలను వ్యతిరేకిస్తున్నాయి. పైగా నాలుగు అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలన్న జగన్ ఆలోచనను జనాలంతా స్వాగిస్తున్నట్లు టిజి చెప్పారు. నిజానికి నాలుగు అభివృద్ధి మండళ్ళ ఏర్పాటుపై జగన్ ఇంత వరకూ ఎక్కడా మాట్లాడలేదు.
విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ఏర్పాటయ్యే అభివృద్ధి మండళ్ళే నాలుగు రాజధానులుగా కూడా ఉంటాయని టిజి చెప్పటంతో పార్టీతో పాటు జనాల్లో కూడా అయోమయం మొదలైంది. పైగా నాలుగు రాజధానుల విషయాన్ని జగన్ ప్రధానమంత్రికి చెప్పారని చెప్పటం గమనార్హం. అంటే రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న జగన్ ఆలోచనలకు కేంద్రం మద్దతుంది అని టిజి చెబుతున్నట్లే అర్ధమవుతోంది.
అమరావతిలో రాజధానిని నిర్మించటం స్ధానిక రైతులకు ఏమాత్రం ఇష్టం లేదని టిజి అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ ను ఓడించటమే ఇందుకు నిదర్శనంగా టిజి చెప్పారు. అంటే ఈ యాంగిల్ లో చూస్తే టిజి చెప్పేది నిజమే అనిపిస్తోంది. మరి అమరావతిని ఇక్కడి నుండి తరలించేందుకు లేదంటూ రైతుల పేరుతో జరుగుతున్న రచ్చంతా టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఆడిస్తున్న డ్రామాలేనా ?