యువ నేత నారా లోకేష్ ఎట్టకేలకు ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. కానీ, తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం కనిపించడంలేదు. అరెస్టు భయం తప్పడంతో, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టగలిగారన్నది బహిరంగ రహస్యం.
ఇక, చంద్రబాబు పరిస్థితి వేరు. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఇంకోసారి పొడిగించబడింది. దాంతో, ఇంకొన్ని రోజులు ఆయన జైల్లోనే వుండక తప్పదు. అది రోజులు మాత్రమేనా.? కొన్ని వారాల పాటు అవుతుందా.? కొన్ని నెలలపాటు చంద్రబాబు జైలుకే పరిమితమవుతారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తక్కువలో తక్కువ రెండేళ్ళు చంద్రబాబు జైల్లోనే వుంటారన్నది వైసీపీ శ్రేణుల్లో బలంగా జరుగుతున్న చర్చ. వైఎస్ జగన్ అంతలా చంద్రబాబుపై పగబట్టేశారట. వైఎస్ జగన్ ఏడాదిన్నరపాటు అక్రమాస్తుల కేసుల్లో జైల్లో వుండటానికి కారణం చంద్రబాబేనని వైసీపీ తరచూ చెబుతుంటుంది.
జైల్లో పెట్టించింది కాంగ్రెస్ అంటారు.. ఇప్పుడేమో, టీడీపీ అంటున్నారు.. ఇంతకీ, వైఎస్ జగన్ ఎవరి వల్ల జైలుకు వెళ్ళినట్లు.? ఆ సంగతి పక్కన పెడితే, జగన్ వల్లనే చంద్రబాబు జైలుకు వెళ్ళారు.. దానికి బీజేపీ పెద్దల ఆశీస్సులు కూడా వున్నాయి.
చంద్రబాబేమో జైల్లో వుండి చక్రం తిప్పలేకపోతున్నారు. ఒకప్పుడు సైకిల్ వేరు, ఇప్పుడు సైకిల్ వేరు. సైకిల్ పాడైపోయింది.. చక్రాలూ పాడైపోయాయి. ఈ విషయం తెలుగు తమ్ముళ్ళకీ బాగానే అర్థమవుతోంది. లోకేష్ ఢిల్లీకి పారిపోవడం తెలుగు తమ్ముళ్ళకు చాలా చాలా అనుమానాలు కలిగేందుకు ఆస్కారం కల్పించింది.
ఇంకోపక్క, చంద్రబాబూ బయటకు రాలేకపోతుండడాన్ని తెలుగు తమ్ముళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి అయితే, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో నాయకులు నిలబడటం కష్టం.